కరోనా పాజిటివ్ వచ్చి చాలా తక్కువ లక్షణాలు, వ్యాధి తీవ్రత లేని వారిని మళ్లీ ఎలాంటి పరీక్షల అవసరం లేకుండానే పది రోజుల్లో ఇళ్లకు పంపనున్నారు. వారి వ్యాధి లక్షణాలను పరిశీలించి వరుసగా 3 రోజులపాటు జ్వరం లేకుంటే డిశ్చార్జి చేస్తారు. ఈ మధ్యలో కరోనా చికిత్స కేంద్రాల్లో ఉంచి వారి శరీర ఉష్ణోగ్రతలు, నాడీ స్పందనను నిరంతరం పర్యవేక్షిస్తారు. పాజిటివ్ కేసుల్లో ఎలాంటి లక్షణాలుంటే ఎలాంటి చికిత్స అవసరం? ఏ స్థాయి వారిని ఎలా డిశ్చార్జి చేయాలనే అంశాలపై కొత్త విధివిధానాలను ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులిచ్చారు.
వ్యాధి లక్షణాలు తక్కువగా, చాలా తక్కువగా అసలు కనిపించకుండా పాజిటివ్ వస్తే: వారిని పది రోజులు కరోనా చికిత్స కేంద్రాల్లో ఉంచి పర్యవేక్షిస్తారు. పది రోజుల తరువాత వరుసగా 3 రోజులపాటు జ్వరం లేకుంటే ఇళ్లకు పంపుతారు. వారు 7 రోజులపాటు ఇంట్లోనే క్వారంటైన్ పాటిస్తూ తమకు మళ్లీ లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయేమోనని చూసుకుంటూ ఉండాలి.
* ఇళ్లకు వెళ్లాక ఎవరికైనా తిరిగి మళ్లీ వ్యాధి లక్షణాలు కనిపించినా, జ్వరం వచ్చి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైనా తిరిగి కొవిడ్ కేంద్రాలను సంప్రదించాలి. లేదంటే హెల్ప్‌లైన్ 1075కు ఫోన్ చేయాలి.
* కరోనా చికిత్స కేంద్రాల్లో ఉండగానే ఆక్సిజన్ స్థాయిలు 95శాతం నుంచి దిగువకు పడిపోతే వారిని జిల్లా కొవిడ్ ఆస్పత్రులకు చేరుస్తారు.
వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న పాజిటివ్ కేసుల్లో..
* వీరిని ఆక్సిజన్ సౌలభ్యంతో కూడిన పడకలు ఉండి పూర్తిగా కరోనా నివారణ కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాలకు తరలిస్తారు.
* అలాంటి రోగుల్లో వ్యాధి లక్షణాలు 3 రోజుల్లో తగ్గిపోయి ఆక్సిజన్ స్థాయి 95శాతం కన్నా ఎక్కువగా 4రోజులపాటు కొనసాగితే అలాంటివారిని పది రోజుల్లో ఇంటికి పంపిస్తారు.
* జ్వరం, శ్వాస సమస్యలు లేకుండా ఆక్సిజన్ అవసరం లేని వారిని ఎలాంటి పరీక్షలు చేయకుండానే ఇళ్లకు పంపుతారు.
* ఇలాంటి కేసుల్లో 3 రోజుల్లో జ్వరం తగ్గకుండా ఆక్సిజన్ చికిత్స ఇంకా అవసరమవుతూ ఉంటే అలాంటివారిని ఆస్పత్రి నుంచి పంపడానికి మరింత సమయం తీసుకుంటారు. 3రోజులపాటు జ్వరం లేకుండా, శ్వాస సమస్యలు లేకుండా, ఆక్సిజన్ అవసరం రాకుండా ఉంటే వారికి తిరిగి కరోనా పరీక్షలు చేస్తారు. ర్యాపిడ్ యాంటీజెన్ కిట్‌తో పరీక్షించి నెగెటివ్ వస్తే డిశ్చార్జి చేస్తారు. ఒకవేళ అప్పుడూ పాజిటివ్ వస్తే మరో 3రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఆ తర్వాత పరీక్షల అవసరం లేకుండానే ఆస్పత్రి నుంచి ఇళ్లకు పంపుతారు.
* వ్యాధి నిరోధక శక్తి లేని, తీవ్ర లక్షణాలున్న కేసుల్లో... (హెచ్‌ఐవీ, అవయవ మార్పిడి వంటివి జరిగిన వారిలో...)
* పూర్తిగా వ్యాధి నుంచి కోలుకున్నాకే ఇంటికి పంపుతారు. వీరు ఎలాంటి మందులు వేసుకోకుండానే 3రోజులపాటు జ్వరమూ, ఎలాంటి లక్షణాలు లేకుండా ఉండాలి.
* 4 రోజులపాటు ఆక్సిజన్ స్థాయిలు సరిగ్గా ఉండాలి.
* శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉండకూడదు.
* సీఆర్‌పీ, ఈఎస్‌ఆర్, పీసీటీ వంటి పరీక్షల్లో సాధారణ స్థాయిలు, తగ్గుతున్న సరళి ఉన్నప్పుడే రోగిని ఆస్పత్రి నుంచి పంపేందుకు సిద్ధమై తిరిగి కరోనా పరీక్షలు చేస్తారు.
* ఆర్‌టీపీసీఆర్ పరీక్ష నిర్వహించి నెగెటివ్ వస్తే ఇళ్లకు పంపుతారు. పాజిటివ్ వస్తే మళ్లీ 72 గంటల తర్వాత పరీక్షించి నెగెటివ్ వచ్చాకే ఇళ్లకు పంపుతారు.
ఇదీ చదవండి: తెదేపా హయాంలో కట్టిన ఇళ్లను ఎందుకివ్వరు?: చంద్రబాబు