కరోనా సమయంలో పోలీసుల విధులు సవాల్‌గా మారాయి. కరోనా వైరస్ పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వైద్యులతో పాటు పోలీసులు కరోనాతో నిత్యం యుద్ధం చేస్తున్నారు. విజయవాడ నగర కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 72 మంది పోలీసు సిబ్బందికి కరోనా సోకిందని విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. కరోనా సోకిన పోలీసు సిబ్బంది మెరుగైన వైద్య సౌకర్యాలందించేందుకు సీపీ ప్రత్యేక చర్యలు చేపట్టారు.
- ఆర్‌ఐ, కొంతమంది ఎస్‌ఐలతో పోలీసుల సంక్షేమ కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కొవిడ్ బారిన పడిన సిబ్బందిని ఆసుపత్రిలో చేర్పించడం దగ్గర నుంచి.. చికిత్స ఎలా ఉంది. మందులు ఏమైనా కావాలా.. ఆసుపత్రిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం వంటివి చేస్తారు.
- కొవిడ్ సోకిన వ్యక్తి కుటుంబానికి మనోధైర్యాన్ని నింపేందుకు వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. నెలకు సరిపడా నిత్యావసర సరకులను అందజేస్తున్నారు. వీరిలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలుంటే దగ్గరుండి తగు చర్యలు తీసుకుంటున్నారు.
- ఆవిరి పట్టడానికి వీలుగా ఆవిరి విడుదల పరికరం, మాస్కులు, బలవర్థకమైన ఆహారం, శానిటైజర్ తదితరాలను అందిస్తున్నారు.
- బాధిత పోలీసులతో ప్రతిరోజూ ఉన్నతాధికారులు ‘ఆన్‌లైన్’లో మాట్లాడుతున్నారు.
- ఎస్.బి, సైబర్‌క్రైం అధికారులు రోజువారీ నివేదికలతో పాటు కొవిడ్ బాధిత పోలీసుల ఆరోగ్యస్థితికి సంబంధించిన నివేదికలు, గణాంకాలు కూడా ఇచ్చేలా ఆదేశాలిచ్చారు.
- అలాగే విధులు నిర్వహిస్తూ కరోనా బారిన పడి దానిని జయించి తిరిగి విధులకు హాజరైన పోలీసులను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. కరోనా బారిన పడిన వారికి పోలీస్‌శాఖ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్య పడొద్దని భరోసా కల్పిస్తున్నారు.
కమిషనరేట్ పరిధిలో.. కొవిడ్ బారిన పడిన పోలీసులు 72
డీసీపీలు: 3
ఏడీసీపీ: 1
సీఐ: 1
ఎస్‌ఐ: 6
ఏఎస్‌ఐ: 4
హెడ్‌కానిస్టేబుళ్లు: 21
కానిస్టేబుళ్లు: 27
హోంగార్డులు: 9
డిశ్ఛార్జి అయినవారు: 43
చికిత్స పొందుతున్న సిబ్బంది: 8
హోం క్వారంటైన్‌లో ఉన్నవారు: 29
ఇదీ చదవండి: హుండీ ఆదాయం రూ.50 లక్షలే!