రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న తయారీ రంగంపై... కరోనా మహమ్మారి పిడుగులా పడింది. ఈ వైరస్ దెబ్బకు రాష్ట్రంలో 80 శాతం వరకు ఉత్పత్తి ఆగిపోయింది. ఆటోమొబైల్, టెక్స్‌టైల్, స్పిన్నింగ్, జిన్నింగ్, ఫార్మా...ఇలా అన్ని రంగాలపైనా ప్రభావం పడింది. కొవిడ్ వ్యాప్తికి ముందే ఆర్థిక మాంద్యంతో సతమతమవుతున్న పారిశ్రామిక రంగం... ప్రస్తుత పరిస్థితులతో పూర్తిగా కుదేలయ్యే ప్రమాదంలో పడింది.
రాష్ట్రంలో కేవలం నిత్యావసర సరుకులకు సంబంధించిన 20 శాతం ఉత్పత్తి మాత్రమే జరుగుతోందని... మిగిలినవన్నీ మూసేసిన కారణంగా తీవ్ర నష్టం తప్పదని పారిశ్రామిక నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల్లో పక్క రాష్టాలవారే అధికమని కరోనా కాటు తర్వాత వారొచ్చే అవకాశం కూడా ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఇన్ని సమస్యల నుంచి కొంతైనా కోలుకోవాలంటే... ఉత్పత్తితో సంబంధం లేకుండా పరిశ్రమలపై విధించే విద్యుత్ డిమాండ్ ఛార్జీలు ఎత్తివేయాలని కోరారు. అనుబంధ ఛార్జీలను తగ్గించాలన్నారు.
ప్రభుత్వం నుంచి రావాల్సిన దాదాపు 4 వేల కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు పెండింగ్‌లో ఉన్న కారణంగా.. పలు పరిశ్రమలు ఓవర్ డ్రాఫ్ట్‌లోకి వెళ్లాయని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు చెప్పారు. కేంద్రం చెప్పినట్లుగా 30 నుంచి 40 శాతం కార్మికులతో పరిశ్రమలు నడిపితే... నష్టాలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. కేంద్రం ప్రకటించిన ఉద్దీపనలు కూడా తయారీరంగం కోలుకోవడానికి ఉపకరించవని అభిప్రాయపడ్డారు.
వడ్డీ రాయితీ సహా కనీసం 6నెలల పాటు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తే కొంతవరకు ప్రయోజనం ఉండవచ్చని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు అంటున్నారు. వచ్చే 3 నెలల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే చర్యలపైనే తయారీరంగం భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చదవండి: