ఆధ్యాత్మిక వైభవంతో కళకళలాడే బెజవాడ దుర్గగుడి.. ఆర్థిక తప్పిదాలు, నిఘా విభాగాల తనిఖీలు వంటి వ్యవహారాలతో ఈ మధ్య వివాదాస్పద వార్తల్లో నిలుస్తోంది. ఆలయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అవినీతి నిరోధకశాఖ మెరుపుదాడులతో ఈవో సురేశ్‌బాబుపై వేటు.. 15మంది ఉద్యోగులపైనా క్రమశిక్షణాచర్యలు తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. దుర్గగుడికి ఈవోలుగా ఎవరొచ్చినా ఏడాది తిరిగే సరికి కొన్ని వివాదాలు మూటకట్టుకొని వెళ్లిపోవాల్సి వస్తోంది. 2010 నుంచి 2021 వరకు ఏకంగా 11 మంది ఈవోలు మారారు. వాస్తవంగా ఈవోలకు మూడేళ్ల కాల పరిమితి ఉన్నా.. ఏడాది దాటి రెండు మూడు నెలలయ్యే సరికే ఎక్కువ మంది ఇక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈవోల బదీలీలు
2015లో దుర్గగుడి ఈవోగా బాధ్యతలు చేపట్టిన నర్సింగరావుకు.. ఉద్యోగులతో వివాదాలు నెలకొన్నాయి. ఓ అర్చకుడు ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు పరిస్థితి వెళ్లటంతో ఆయన.. బదిలీ కావాల్సి వచ్చింది. తర్వాత ఈవోగా ఐఏఎస్ అధికారి సూర్యకుమారి వచ్చినా.. క్షుద్రపూజలు జరిగాయనే ఆరోపణలతో ఆమె కూడా వెళ్లిపోవాల్సి వచ్చింది. అనంతరం ఈవోగా పద్మ పాలనలో.. అమ్మవారికి చెందిన ఖరీదైన పట్టుచీర చోరీ జరగడం, పాలకమండలి సభ్యురాలిపైనే ఆరోపణలు రావటం సంచలనమైంది. పద్మ తర్వాత ఈవోగా కోటేశ్వరమ్మ పనిచేయగా.. చీరల కౌంటర్‌లో ఉండే ఓ ఉద్యోగి రూ.70లక్షలకు పైగా అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత దుర్గగుడి ఈవోగా సురేష్‌బాబు బాధ్యతలు చేపట్టారు.
సురేష్‌బాబు హయాంలో అనేక అవకతవకలు
సురేష్‌బాబు నియామకంతో.. ఆలయ ఈవోగా ఐఏఎస్ అధికారి ఉండాలనే నిబంధన మారిపోయింది. సురేష్‌బాబు హయాంలో టెండర్లు సహా అనేక అవకతవకలు జరిగినట్లు అనిశా నివేదిక ఇవ్వడం.. సంచలనం సృష్టించింది. ఆయన అనంతరం ఆర్జేసీ హోదాలోని భ్రమరాంబ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఆలయానికి సంబంధించిన 243 ఎకరాల భూమికి.. ఏటా 50లక్షలకు మించి కౌలు రావటం లేదు. 2010 నుంచి దుర్గగుడి ఆస్తుల రిజిస్టర్‌ను నవీనీకరించలేదు. ఇటీవల ఆలయంలో కొండచరియలు విరిగిపడటం అలజడి కలిగించింది. టెండర్ల విషయంలో సంస్కరణలు ఇప్పుడు కొత్త ఈవో ముందు సవాల్‌గా నిలుస్తున్నాయి. ఆలయఅభివృద్ధికి మెరుగైన పాలన అందించేందుకు కృష్టి చేస్తానని ఈవో భ్రమరాంబ విశ్వాసం వ్యక్తం చేయటంతో.. సుపరిపాలన జరుగుతుందనే ఆశలు రేకెత్తుతున్నాయి.
ఇదీ చదవండి: సర్వశక్తులూ ఒడ్డుతున్న తెదేపా.. గెలుపుపై వైకాపా ధీమా..!