Police Focus on YSRCP Leader Vallabhaneni Vamsi irregularities : ప్రశాంత గన్నవరం నియోజకవర్గం వైఎస్సార్సీపీ హయాంలో అరాచకాలకు అడ్డాగా మారింది. అరాచకవాదిగా పేరొందిన అప్పటి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ, అతని అనుచరులు ఆగడాలకు అంతూ పొంతూ లేకుండా పోయింది. వీరికి అప్పటి పోలీసులు వంత పాడారు. టీడీపీ నేతల ఫిర్యాదులపై పోలీసులు వంశీ ఒత్తిళ్లకు తలొగ్గి నామమాత్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ కేసుల దర్యాప్తు కూడా పక్కదారి పట్టించి మధ్యలోనే వదిలేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీ లెక్క తేల్చేందుకు సిద్ధం అవుతోంది. అతని హయాంలో అరాచకాలపై కూలంకషంగా దర్యాప్తు చేస్తోంది. దీంతో అక్రమార్కుల్లో వణుకు మొదలైంది.
అంతమొందించే కుట్ర : ఆర్థికంగా, రాజకీయంగా గన్నవరంలో బలవంతుడైన కాసరనేని రంగబాబు.. యార్లగడ్డ వెంకట్రావుకు మద్దతుగా టీడీపీలో చేరడం వంశీకి రుచించలేదు. పైగా అతను మండలంలో చాలా మందిని టీడీపీలోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో కక్ష పెట్టుకున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి కిరాయి మూకను రప్పించి మరీ హత్యాయత్నానికి పాల్పడడం గన్నవరంలో ఒక్కసారిగా అలజడి రేపింది. అప్పటి పోలీసులు దాడి కేసుగానే నమోదు చేశారు. తాజా దర్యాప్తులో వాస్తవాలు బయటకు రావడంతో హత్యాయత్నం కిందకు మార్చారు.
వల్లభనేని ప్రధాన అనుచరుడు మోహనరంగా అరెస్ట్ - పరారీలో శేషు
యువగళంలో రచ్చ : టీడీపీ యువనేత, ప్రస్తుత మంత్రి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగానూ వంశీ వర్గం అరాచకాలకు పాల్పడింది. గన్నవరంలో జరిగిన బహిరంగ సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారని అయ్యన్నపాత్రుడు, బొండా ఉమా, బుద్దా వెంకన్న, తదితర నేతలపై కేసులు పెట్టి అరెస్టు చేసేందుకు యత్నించారు. బాపులపాడు మండలం రంగన్నగూడెంలో రెచ్చగొట్టే రీతిలో ఫ్లెక్సీ ఏర్పాటు చేయించి, యువగళం బృందంపై దాడికి దిగారు. ప్రస్తుత మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావులపైనా కేసులు పెట్టించారు. ఇదే వివాదంలో తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తల్ని కేసుల్లో ఇరికించారు.
లెక్క తేల్చేపనిలో : తమను అక్రమ కేసుల్లో ఇరికించి, గ్రామాలను, ఇళ్లను వదిలి పారిపోయేలా చేశారనీ, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వంశీ, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులు ఎప్పట్నుంచో గట్టిగా పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు ఒక్కో ఉదంతంపై నిశితంగా దర్యాప్తు సాగిస్తున్నారు. ఇప్పటికే రెండు కేసుల్లో అరెస్టులు చేసిన నేపథ్యంలో తర్వాత యువగళం పాదయాత్ర, ఎన్నికల సమయంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిని అడ్డుకుని, దాడికి ప్రయత్నించిన వ్యవహారం, రాష్ట్ర తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి మూల్పూరి కల్యాణిని అసభ్యంగా దూషించడం, ఆమెను అరెస్టు చేయించడం, తిప్పనగుంటలో సహకార సంఘం మాజీ అధ్యక్షుడు మాదల శ్రీనుకు చెందిన దుకాణం కూల్చివేత ఘటనలపై పోలీసులు దృష్టి సారించారు. సూరంపల్లిలో పార్టీ మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు పట్టా భూమిలో నిర్మాణాల కూల్చివేత, పోలింగ్ రోజున దాడులు వంటి అరాచకాలపై రోజుల వ్యవధిలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
టీడీపీ వర్గీయులపైనే ఎదురు కేసులు : నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల్ని భయభ్రాంతులకు గురిచేసే లక్ష్యంతో వంశీ, అతని అనుచరులు ఆ పార్టీ నియోజకవర్గ కార్యాలయంపై గత ఏడాది ఫిబ్రవరిలో దాడికి పాల్పడ్డారు. అంతకు ముందే బీసీ నేత దొంతు చిన్నా నివాసంపై దాడి చేశారు. ఆయనకు మద్దతుగా వచ్చిన ప్రస్తుత స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిని అరెస్టు చేయించారు. పోలీసులు సైతం అప్పట్లో వంశీకి పూర్తిగా సహకరించారు. పోలీసులను తోసుకుంటూ కార్యాలయంలోకి దూసుకొచ్చిన అల్లరిమూకలు కర్రలు, రాళ్లతో టీడీపీ కార్యాలయంలోకి ప్రవేశించి అద్దాలు, కంప్యూటర్లు, కుర్చీలు, టేబుళ్లు పగలగొట్టారు. ఇదే క్రమంలో అక్కడే ఉన్న ఇన్నోవా కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీనిని పోలీసులు అడ్డుకోకుండా టీడీపీ వర్గీయులపైనే ఎదురు కేసులు పెట్టారు.
వల్లభనేని కోసం మూడు బృందాలు గాలింపు - ఇప్పటికే వంశీ అనుచరులు అరెస్ట్ - Police Searching for Vamsi