Jammalamadugu MLA Adinarayana Reddy Followers Attack on Adani Camp Office : వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం రాగికుంట గ్రామం వద్ద పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణ పనులు చేస్తున్న అదానీ సంస్థ సిబ్బందిపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యులు రాళ్ల దాడికి తెగబడ్డారు. రాగికుంట వద్ద 470 ఎకరాల విస్తీర్ణంలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్ నిర్మాణాన్ని ఆదానీ సంస్థ ప్రారంభించింది. క్యాంపు ఏర్పాటు చేసుకుని యంత్రాలతో నేల చదును పనులు చేపట్టింది. MLA, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులైన శివనారాయణ రెడ్డి, రాజేష్‌రెడ్డి తమ అనుచరులను వెంట పెట్టుకుని వాహనాల్లో అక్కడికి వెళ్లి ఆదానీ సంస్థ ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు.
MLAకు చెప్పకుండా పనులు ఎలా చేపడతారంటూ రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత సంస్థ ప్రతినిధులతో చర్చించారు. డబ్బుల కోసమే దాడికి పాల్పడ్డారన్న అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే అనుచరులు, కుటుంబీకులు నియోజకవర్గ పరిధిలోని పరిశ్రమలను బెదిరిస్తున్నారని, డబ్బుల కోసం వేధిస్తున్నారని ఫిర్యాదులు అందటంతో రెండు రోజుల కిందటే ఆయన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంవోకు పిలిపించారు. వైఎస్సార్సీపీ పాలన వల్ల దెబ్బతిన్న రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి, అభివృద్ధి చేసేందుకు, ఉపాధి కల్పించేందుకు ఓ వైపు తాను ప్రయత్నిస్తుంటే పారిశ్రామికవేత్తలను బెదిరించడం, డబ్బులు అడగడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
సీఎం మందలించినప్పటికీ ఆయన కుటుంబీకులు మంగళవారం సాయంత్రం అదాని సంస్థ క్యాంపుపైనా దాడి చేశారు. అక్కడున్న వాహనాలు, యంత్రాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై అదానీ సంస్థ ప్రతినిధులు మంగళవారం రాత్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి ఆదానీ సంస్థ ప్రతినిధులు తీసుకెళ్లినట్లు తెలిసింది. దిల్లీ పెద్దలు తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.
ఉద్యోగాలు అడిగేందుకే వెళ్లారు: మా ప్రాంతంలో పరిశ్రమ పెడుతున్నారని తెలిసి, స్థానికులకు ఉద్యోగాలివ్వాలని, తమ వాహనాలను అద్దెకు పెట్టుకోవాలని అడగడానికి మాత్రమే మావాళ్లు అక్కడికి వెళ్లారని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెలిపారు. పనులు జరుగుతున్న ప్రాంతాన్ని ఒక చుట్టూ చుట్టొచ్చారంతే. అదే సమయంలో అక్కడ వైఎస్సార్సీపీ నాయకులు కనిపించడంతో మా వాళ్లకు కోపం వచ్చింది. అంతకుమించి అక్కడేమీ జరగలేదని ఎమ్మెల్యే తెలుపుతున్నారు.