ఒకవైపు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు సై అంటూనే, మరోవైపు పంచాయతీ ఎన్నికలు వద్దు అనడం ద్వారా.. వైకాపా, ఉద్యోగ సంఘాల ద్వంద్వ వైఖరి స్పష్టమవుతోందని కాంగ్రెస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు నర్రెడ్డి తులసిరెడ్డి విమర్శించారు. ఈ ఎన్నికలకు అడ్డురాని కరోనా వ్యాక్సినేషన్ పక్రియ.. స్థానిక పోరుకు ఎందుకు విఘాతమో చెప్పాలని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం కోసం ఆయా సంఘాల నాయకులు కృషి చేస్తే ఉద్యోగులు హర్షిస్తారే తప్ప.. ప్రభుత్వ భజన చేస్తే కాదని సూచించారు. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్లు ఘర్షణాత్మక వైఖరిని విడనాడి.. న్యాయస్థానం తీర్పు ప్రకారం నడుచుకోవాలని విజ్ఞప్తి చేాశారు.
కాంగ్రెస్ అమలు చేసిన బంగారు తల్లి పథకాన్ని పునరుద్ధరించాలని.. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా తులసిరెడ్డి కోరారు. ఆడపిల్ల పుడితే భారమనే భావన ప్రజల్లో రావడమే.. బాలికల నిష్పత్తి తగ్గిపోవడానికి కారణమన్నారు. ఈ సామాజిక రుగ్మతను నిర్మూలించడం కోసమే కాంగ్రెస్ పార్టీ గతంలో ఈ పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. ఆడపిల్లలు చదువుకుని 21 ఏళ్లు వచ్చాక.. వారికి కొంత నగదు ఇచ్చేలా అప్పుడు పథకాన్ని రూపొందించామన్నారు. దీనిని గత ప్రభుత్వం రద్దు చేయగా.. వైకాపాకు చిత్తశుద్ధి ఉంటే తిరిగి పునరుద్ధరించాలన్నారు.
ఇదీ చదవండి: అన్ని వర్గాల హక్కుల అణచివేతే జగన్ అజెండా: యనమల