APCC Tulasi Reddy: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనలేని స్థితిలో వైకాపా ప్రభుత్వం ఉందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ నత్తనడకన సాగుతోందని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రస్తుతం రోజుకు 10 వేల టన్నులు మాత్రమే సేకరిస్తున్నారని.. ఫలితంగా రాష్ట్రంలో లక్షలాది టన్నుల ధాన్యం కల్లాల్లోనే ఉందన్నారు.
ప్రస్తుతం 8,789 ఆర్కేబీలల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టినప్పటికీ.. గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్లోనే కొనుగోలు మందకొడిగా సాగుతోందన్నారు. గత రెండేళ్లలో ఫిబ్రవరి 25 నాటికి ఖరీఫ్ ధాన్యం సేకరణ వివరాలు పరిశీలిస్తే.. 2019-20లో 42.56 లక్షలు, 2020-21లో 39.94 లక్షల టన్నులు సేకరించగా.. ఈ ఖరీఫ్ సీజన్ పంటకు సంబంధించి 35.94 లక్షలే కొనుగోలు చేశారని విమర్శించారు.
గతేడాదితో పోలిస్తే నాలుగు లక్షల టన్నుల సేకరణలో పౌరసరఫరాల సంస్థ వెనుకబడిందన్నారు. నిధులు లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని ఆయన మండిపడ్డారు. నెల రోజులుగా డబ్బులు చెల్లించే ప్రక్రియ నిలిచిపోవడంతో సేకరణనూ అధికారులు నిలిపివేశారని తులసిరెడ్డి పేర్కొన్నారు. తక్షణమే రైతుల ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి డబ్బు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: