Condolence to Rosaiah: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య ఆకస్మికమృతిపై ముఖ్యమంత్రి సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉదయం రోశయ్య కుమారుడితో ఫోన్లో మాట్లాడారు. రోశయ్య ఆకస్మిక మృతికి దారితీసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢసానుభూతిని తెలియచేస్తున్నట్టు సీఎం తెలిపారు. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో రోశయ్యది ఆదర్శప్రాయమైన జీవితమని కొనియాడారు. ఆయన మరణం ఏపీకీ తీరని లోటని పేర్కొన్నారు. మరోవైపు ఆయన మృతికి సంతాప సూచకంగా 3 రోజులపాటు అధికారిక సంతాప దినాలను ప్రభుత్వం ప్రకటించింది.
రోశయ్య మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. పరిపాలనాదక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా రోశయ్య ఎంతో పేరు గడించారని అన్నారు.
"పరిపాలనాదక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా రోశయ్య పేరు ప్రఖ్యాతులు గడించారు. విద్యార్థి సంఘ నాయకుడి నుంచి గవర్నర్ స్థాయికి అంచలంచెలుగా ఎదిగారు. వివాదరహితుడిగా నిలిచారు. తనకు అప్పగించిన ఏ బాధ్యతలనైనా సమర్థవంతంగా రోశయ్య నిర్వహించారు. సుదీర్ఘకాలం ఆర్థికశాఖ మంత్రిగా సేవలనందించారు."
-చంద్రబాబు,తెలుగుదేశం పార్టీ అధినేత
రోశయ్య మరణం పట్ల పురపాలక శాఖ మంత్రి, బొత్స సత్యనారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
"రోశయ్య మరణంతో తెలుగునేల ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది. నిరాండబరుడు, నిగర్వి అయిన రోశయ్య లేని లోటు తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్న. రోశయ్య కుటుంబ సభ్యులకు నా సానుభూతి."
-బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ మంత్రి
"అజాతశత్రువుగా రోశయ్య పేరు తెచ్చుకున్నారు. ఆయన మరణం విచారకరం" -సుజనా చౌదరి, భాజపా ఎంపీ
రాజకీయ జీవితంలో విలువలకు పట్టం కట్టిన రోశయ్య మరణం బాధాకరమని.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
"సమున్నత వ్యక్తిత్వంతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్న. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి" -నారా లోకేశ్, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి
రాజకీయాల్లోకి రావాలని తనను మనస్ఫూర్తిగా ఆహ్వానించారని సినీనటుడు చిరంజీవి తెలిపారు. వివాదరహితులుగా, నిష్కళంకితులుగా రోశయ్య మన్ననలు పొందారని అన్నారు. రోశయ్య కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
"ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేత. విలువలు, సంప్రదాయాలు కాపాడటంలో రుషిలాగా సేవ చేశారు. రోశయ్య మరణంతో రాజకీయాల్లో ఓ శకం ముగిసింది" - చిరంజీవి,సినీనటుడు, మాజీ కేంద్రమంత్రి
"సమయస్ఫూర్తికి, చమత్కార సంభాషణలకు రోశయ్య మారుపేరు. ఎక్కువ సార్లు బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా రోశయ్య పేరొందారు. గొప్ప అనుభవం ఉన్న నాయకుడిని తెలుగుజాతి కోల్పోయింది. కంచుకంఠం, పంచెకట్టుతో తెలుగు సంప్రదాయానికి ప్రతీకగా ఉండేవారు. రోశయ్య కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి" -నందమూరి బాలకృష్ణ, తెదేపా ఎమ్మెల్యే, సినీనటుడు
రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన గొప్ప వ్యక్తి రోశయ్య మరణించడం చాలా బాధాకరం అని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. అనేకమైన పదవులను నిర్విఘ్నంగా, నిజాయితీగా నిర్వహించిన వ్యక్తి రోశయ్య అని ఆయన అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య మృతి బాధాకరం అని కాంగ్రెస్ పార్టీ ఎపీ పీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసి రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కడప జిల్లా వేంపల్లె లోని ఆయన స్వగృహంలో తులసిరెడ్డి దంపతులు రోశయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రోశయ్య కుటుంబసభ్యులకు జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పాలనాపరమైన అంశాలపై సాధికారత కలిగిన నేత రోశయ్యని కొనియాడారు.
దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్యాలయంలో మాజీ ముఖ్య మంత్రి కొణిజేటి రోశయ్య చిత్ర పటానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ,మేయర్ భాగ్యలక్ష్మి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, విద్యార్థులు నివాళ్లు అర్పించారు.
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రోశయ్య మృదు భాషి అని.. అందరినీ కలుపుకొని ముందుకు పోగలిగిన నాయకుడని ఆయన అన్నారు.
రోశయ్య మృతి పట్ల రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, వరుసగా 7సార్లు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో పాటు, అనేక శాఖలు నిర్వహించిన బహుముఖ ప్రజ్ఞాశాలి రోశయ్య అని మంత్రి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థించారు.
ఇదీ చదవండి: rosaiah passes away: రేపు హైదరాబాద్ మహా ప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు