CM JAGAN AT VIJAYAWADA : దసరా నవరాత్రి వేడుకలు వాడవాడలా వైభవోపేతంగా సాగుతున్నాయి. మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే ఆనవాయితీని కొనసాగిస్తూ.. సీఎం జగన్ ఇంద్రకీలాద్రిని సందర్శించారు. సీఎంకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు ఆయన తలకు పరివేష్టం చుట్టారు. పట్టువస్త్రాలు, పసుపు-కుంకుమ సమర్పించిన ముఖ్యమంత్రి జగన్.. అమ్మవారిని దర్శించుకున్నారు. పండితులు వేద ఆశీర్వచనం పలికి, తీర్థప్రసాదాలు అందించారు.
ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు.. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ 55మందికి పైగా బంధువులతో ఆలయంలోకి వెళ్లడం చర్చనీయాంశమైంది. అదికూడా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఆయన ఆలయానికి వెళ్లడంపై విమర్శలు వచ్చాయి. ఇక తాళ్లాయపాలెం శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి.. కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని కోట మహాలక్ష్మి అమ్మవారు సరస్వతిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. విజయనగరం జ్ఞానసరస్వతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అక్షరాభ్యాసం కోసం తల్లిదండ్రులు, పిల్లలు భారీగా తరలివచ్చారు. విశాఖ చిన్నపొల్లమ్మ దేవాలయంలో సరస్వతి పూజ, సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు.
విశాఖ శారదాపీఠంలో సరస్వతీదేవి అలంకారంలోని అమ్మవారికి పీఠాధిపతులు స్వరూపానంద, స్వాత్మానంద హారతులిచ్చి పూజలు చేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా.... ఆంధ్ర విశ్వవిద్యాలయంలో దసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అమ్మవారికి విద్యార్థులు ప్రత్యేక పూజలు చేశారు.
కోనసీమ జిల్లా తాటికాయలవారి పాలెంలో.. దుర్గాదేవి ఆలయంలో నిర్వహించిన సరస్వతీ పూజలో విద్యార్థులు పాల్గొన్నారు. ముమ్మిడివరంలో అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. యానాం గోపాల్ నగర్‌లో కొలువైన శారదాదేవి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు గోస్తనీ నది తీరాన ఉన్న శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారికి, దువ్వ దానేశ్వరికి ప్రత్యేక పూజలు చేశారు.
ఇవీ చదవండి: