ప్రతిపాదిత దిశ చట్టం అమలుపై ముఖ్యమంత్రి జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తమకు జరిగిన అన్యాయాలపై మహిళలు పోలీస్‌స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా..గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసేలా చూడాలన్నారు. జీరో FIR అవకాశాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. దిశ యాప్‌ల్లో ఉన్న అన్ని ఫీచర్లపైనా మహిళా పోలీసులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నారు. రెండు వారాలకోసారి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు మహిళల భద్రతపై సమీక్షించి..ఆ వివరాలను ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. పోలీస్‌స్టేషన్లలో రిసెప్షన్ వ్యవస్థ పటిష్టంగా ఉండేలా చూడాలన్నారు. ప్రతిపాదిత ‘దిశ’ చట్టం ఎలా పనిచేస్తుందన్న అంశం తెలిసేలా ప్రతి పోలీస్‌స్టేషన్‌లో డిస్‌ప్లే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళలు, బాలలపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు.
దిశ చట్టం ఆమోదం ప్రక్రియ చురుగ్గా సాగేలా కేంద్ర స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. డిజిగ్నేటెడ్ కోర్టుల్లో పూర్తిస్థాయి రెగ్యులర్ పీపీల నియామకం వారాంతంలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. 181 మహిళా హెల్ప్‌లైన్‌ను దిశకు అనుసంధానం చేయాలన్నారు. 'దిశ' కాల్‌సెంటర్లో అదనపు సిబ్బంది నియామకానికి పచ్చజెండా ఊపారు. పెట్రోలింగ్ కోసం కొత్తగా 145 వాహనాల కొనుగోలుకు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో 6 కొత్త దిశ స్టేషన్ల నిర్మాణానికి అంగీకరించారు. అందుకు సంబంధించిన నిధులు త్వరగా విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. ఫోరెన్సిక్ ప్రయోగశాలల్లో పోస్టుల భర్తీకి సీఎం అంగీకరించారు. అనంతపురం, రాజమహేంద్రవరం , తిరుపతి, విశాఖ, కర్నూలు, గుంటూరు, విజయవాడలో మూడేళ్లలో దిశ ఫోరెన్సిక్ ల్యాబ్‌లు నిర్మించాలని సూచించారు.
మహిళల భద్రత కోసం గతంలో అమలు చేస్తున్న అభయ ప్రాజెక్టును దిశలో చేర్చాలని నిర్ణయించారు. డిసెంబర్ కల్లా లక్ష వాహనాలకు అభయం పరికరాలు అమరుస్తామని అధికారులు సీఎంకు వివరించారు.
ఇదీచదవండి
AP,TS Water Disputes: సీమ కష్టాలు తెలుసని గతంలో కేసీఆర్ చెప్పారు: సజ్జల