మద్యం అక్రమ రవాణా, నాటుసారా తయారీకి పాల్పడే వారిపై కఠిన చర్యల కోసం తీసుకొచ్చిన చట్టాన్ని పక్కాగా అమలుచేయాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మద్య నియంత్రణలో భాగంగా వాటి ధరలు పెంచామని, మూడింట ఒకవంతు దుకాణాల్ని మూసేశామని చెప్పారు. బెల్టు షాపులు, పర్మిట్ రూములనూ తొలగించామన్నారు. ఫలితంగా మద్యం విక్రయాల పరిమాణం నెలకు 34 లక్షల కేసుల నుంచి 21 లక్షల కేసులకు, బీరు విక్రయాల పరిమాణం 17 లక్షల కేసుల నుంచి 7 లక్షల కేసులకు తగ్గిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మద్యం అక్రమ రవాణా, నాటుసారా తయారీని అడ్డుకుని, బాధ్యులపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ)పై సమీక్ష నిర్వహించారు.
''మద్యం అక్రమ తయారీ, రవాణాపై ఉక్కుపాదం మోపాలి. ఎస్‌ఈబీ కాల్‌సెంటర్ నంబర్‌ను విస్తృతంగా ప్రచారం చేయాలి. మాదకద్రవ్యాలపై కళాశాలలు, వర్సిటీల్లో చైతన్యం కల్పించాలి. గుట్కా విక్రయం, రవాణాపై మరింత దృష్టి పెట్టాలి. గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపి అరికట్టాలి. ఇసుకను నిర్ణీత ధర కంటే ఎక్కువకు అమ్మితే చర్యలు తీసుకోవాలి.'' - జగన్, ముఖ్యమంత్రి
అధిక ధరలకు ఇసుక అమ్మితే చర్యలు
ఇసుకను అధిక ధరలకు అమ్మితే వినియోగదారులు ఫిర్యాదు చేసేందుకు ఏర్పాటుచేసిన ఎస్‌ఈబీ కాల్‌సెంటర్ నంబరుపై విస్తృత ప్రచారం చేయాలి. ఆ నంబరుకు వచ్చే ఫిర్యాదులపై అధికారులు సత్వరమే స్పందించాలి. ఆయా జిల్లాల్లో ఇసుక ధరల వివరాలు తెలియజేస్తూ ప్రకటనలు ఇవ్వాలి. అంతకంటే ఎక్కువ ధరకు ఎవరైనా విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకోవాలి. అధికారులు దీనిపై పర్యవేక్షించాలి. వర్షాలు తగ్గగానే రీచ్‌లు, డిపోల సంఖ్య పెంచాలి.
మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు
మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. వాటి వినియోగం ఉదంతాలు ఏదైనా కళాశాలలో కనిపిస్తే అక్కడ ప్రత్యేకదృష్టి పెట్టాలి. విద్యాసంస్థలపై పర్యవేక్షణ ఉంచాలి. వీటిపై సమగ్ర కార్యాచరణ రూపొందించి రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలి. ఏవేం చర్యలు తీసుకుంటున్నారో తదుపరి సమావేశంలో తెలియజేయాలి. గంజాయి సాగు, రవాణాను అరికట్టాలి. క్రమం తప్పకుండా దాడులు నిర్వహించాలి. పోలీసు విభాగాలు సమన్వయంతో పనిచేయాలి.
అధికారులు ఏమన్నారంటే
*మద్యం అక్రమ రవాణా, నాటుసారా తయారీపై ఇప్పటివరకూ 1,20,822 కేసులు నమోదు చేసి, 1,25,202 మందిని అరెస్టు చేశాం.
* ఇసుక అక్రమ రవాణాపై 12,211 కేసులు నమోదు చేసి, 22,769 మందిని అరెస్టు చేశాం. 5,72,372 టన్నుల ఇసుక, 16,365 వాహనాలు స్వాధీనం చేసుకున్నాం.
* గంజాయి సాగు, అక్రమ రవాణాపై 1,211 కేసులు నమోదు చేసి, 384 మందిని అరెస్టు చేశాం. 18,686 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నాం.
ఇదీ చదవండి:
'విజయవాడ డ్రగ్స్ విలువ రూ.9 వేల కోట్లు కాదు.. 21వేల కోట్లు!'