కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌తో పాటు.. రాష్ట్రంలోని తాత్కాలిక ఉద్యోగుల విషయమై.. ముఖ్యమంత్రి జగన్.. ఉన్నతాధికారులతో సమీక్షించారు. సీఎస్, సంబంధిత మంత్రులు, అధికారులు హాజరై.. పూర్తి వివరాలు ముఖ్యమంత్రికి తెలియజేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో 1,98,221 మంది సీపీఎస్‌లో ఉన్నారని అధికారులు వివరించారు. వారిలో నేరుగా ప్రభుత్వ ఉద్యోగులు 1,78,705 కాగా... గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 3,295 మంది ఉన్నారని.. మిగిలిన 16,221 మంది యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో పని చేస్తున్నారని వెల్లడించారు. వారికి ఏ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తే ఎంత వ్యయం అవుతుందన్న వివరాలను ప్రస్తావించారు.
వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న సీఎం జగన్, ప్రభుత్వంలో విలీనం చేసిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)కు చెందిన దాదాపు 52 వేల మంది ఉద్యోగులను కూడా ఆ జాబితాలో చేర్చి, సమగ్ర నివేదిక (టేబుల్) సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం కాంట్రాక్ట్ ఉద్యోగులపై జరిగిన సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కొన్ని జీవోలు జారీ చేసి, వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని తెలిపారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక వాటన్నింటినీ అమలు చేశామని చెప్పారు. అదే విధంగా మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) కూడా అమలు చేశామని వెల్లడించారు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన విషయం న్యాయపరమైన అంశాలతో ముడి పడి ఉన్నందున, ఆ ఇబ్బందులు తలెత్తకుండా వారికి ఆర్థికంగా ప్రయోజనాలు చేకూర్చేందుకు తగిన విధి విధానాలు రూపొందించాలని జగన్ ఆదేశించారు.
ఇదీ చదవండి: