CM Jagan Meet CJI NV RAMANA: ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ ఆకాంక్షించారు. మరింత పురోగతి సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఈ రోజు క్రిస్మస్. అందరికీ నా శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ శాంతి సౌభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో బాగుండాలి. నన్ను తెలుగువాడిగా ఇక్కడికి ఆహ్వానించి గౌరవించినందుకు అందరికీ ధన్యవాదాలు’ అని చెప్పారు.
సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం శనివారం విజయవాడలోని ఇందిరాగాంధీ నగర పాలక సంస్థ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తేనీటి విందు ఇచ్చింది. సభా వేదికపై సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ, ముఖ్యమంత్రి జగన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కూర్చున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి కూడా వేదికపై ఉన్నారు. 1965 తర్వాత తెలుగు వ్యక్తి భారతదేశ ప్రధాన న్యాయమూర్తి కావడం తెలుగు మాట్లాడే వారందరికీ గర్వకారణమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రాష్ట్రం నుంచి సీజేఐ స్థాయికి ఎదగడం ఈ ప్రాంతానికి గర్వకారణమని వివరించారు.
సీజేఐగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా తనకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ తేనీటి విందు ఏర్పాటు చేయడం సంతోషకరమని జస్టిస్ ఎన్.వి.రమణ వ్యాఖ్యానించారు. వారికి తన తరఫున, కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలిపారు.
వేదిక బయట వేచి చూసి.. సాదర ఆహ్వానం
తొలుత ముఖ్యమంత్రి జగన్ తన సతీమణి వై.ఎస్.భారతితో కలిసి ఇందిరాగాంధీ నగర పాలక మైదానంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. సాయంత్రం 5.09 గంటలకు జస్టిస్ ఎన్.వి.రమణ వచ్చే వరకూ వేదిక బయటే వేచి ఉండి ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు. సీజేఐకి, ఆయనతోపాటు వచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, ఏపీ, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలకు ముఖ్యమంత్రి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. సీజేఐ సతీమణి శివమాలకు ముఖ్యమంత్రి సతీమణి వై.ఎస్.భారతి పుష్పగుచ్ఛం అందించి ఆహ్వానించారు. అనంతరం సీఎం దంపతులు వారందరినీ సభా ప్రాంగణంలోకి తోడ్కొని వెళ్లారు.
మంత్రుల్ని పరిచయం చేసిన ముఖ్యమంత్రి
సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణతో కలిసి ముఖ్యమంత్రి జగన్ ఒక్కో టేబుల్ వద్దకు వెళ్లారు. ఉప ముఖ్యమంత్రులు కె.నారాయణస్వామి, ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కొడాలి నాని, పేర్ని నాని తదితరుల్ని ముఖ్యమంత్రి.. సీజేఐకి పరిచయం చేశారు. అనంతరం అఖిల భారత సర్వీసు అధికారులు శ్రీలక్ష్మి, పూనం మాలకొండయ్య, రజత్ భార్గవ, రేఖారాణి, ఎం.టి.కృష్ణబాబు, విజయ్ కుమార్ తదితరుల్ని పరిచయం చేశారు. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి సీజేఐ, సీఎం వెంట ఉన్నారు. కార్యక్రమంలో తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్‌రావు, వల్లభనేని వంశీమోహన్, మేకా వెంకట ప్రతాప అప్పారావు, వైకాపా నాయకులు దేవినేని అవినాష్, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.
హైకోర్టు న్యాయమూర్తులకు అభివాదం
అంతకు ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులున్న టేబుళ్ల వద్దకు వెళ్లి సీజేఐ, ముఖ్యమంత్రి అభివాదం చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.విజయలక్ష్మి, జస్టిస్ ఆర్.రఘునందనరావు, జస్టిస్ ఎం.వెంకట రమణ, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి, జస్టిస్ యు.దుర్గాప్రసాద్ రావు, జస్టిస్ ఎం.గంగారావు, జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ డీవీఎస్ సోమయాజులు, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్, జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రమేష్, జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ కృష్ణమోహన్, జస్టిస్ కె.సురేష్‌రెడ్డి, జస్టిస్ నైనాల జయసూర్య, జస్టిస్ బి.మన్మథరావు, జస్టిస్ బీఎస్ భానుమతి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ నవీన్ రావు, తదితరులు పాల్గొన్నారు.
ఆత్మీయ సత్కారం
తేనీటి విందు సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణను ముఖ్యమంత్రి జగన్ సత్కరించారు. పుష్పగుచ్ఛం అందించి, దుశ్శాలువ కప్పి సన్మానించారు. శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రతిమను జ్ఞాపికగా అందించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, ఏపీ, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలను ముఖ్యమంత్రి శాలువ కప్పి, శ్రీవారి ప్రతిమ అందించి సత్కరించారు. అంతకు ముందు జస్టిస్ ఎన్.వి.రమణ వేదికపై క్రిస్మస్ కేక్ కోశారు. ముఖ్యమంత్రికి, వేదికపై ఉన్న ఇతర న్యాయమూర్తులకు అందించారు. సాయంత్రం 6 గంటలకు తేనీటి విందు ముగిసిన అనంతరం సీఎం జగన్ వేదిక బయట వరకు వచ్చి సీజేఐకి వీడ్కోలు పలికారు. తేనీటి విందు కార్యక్రమంలో సీజేఐ సతీమణి శివమాల, ముఖ్యమంత్రి సతీమణి వై.ఎస్.భారతి ఒకే టేబుల్‌వద్ద కూర్చున్నారు.
ఇదీ చదవండి :
CJI NV Ramana: బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు