YSRCP Meeting: మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ, పార్టీ జిల్లాల అధ్యక్షులకు బాధ్యతలు అప్పగింత తర్వాత సీఎం జగన్.. నేడు కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, జిల్లా అధ్యక్షులు, వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలతో భేటీ కాబోతున్నారు. మంత్రి పదవులు రానివారు, కోల్పోయిన వారు నిర్వహించిన బలప్రదర్శన నేపథ్యంలో సమన్వయంతో ఎలా ముందుకెళ్లాలనే అంశంపైనా నేతలకు సూచనలు చేయనున్నారు. కొత్త మంత్రులతో తాజా మాజీ మంత్రులు పొసగకపోవడం వంటి సమస్యలు కొన్ని చోట్ల ఉన్నాయి. వీటిపైనా సీఎం జగన్ సూచనలిస్తారని తెలిసింది.
మరోవైపు ఇంటింటికీ పార్టీ వెళ్లే కార్యక్రమం కార్యాచరణపై ప్రకటన చేసే అవకాశాలున్నాయి. ఈ కార్యక్రమం 2 లేదా మూడు నెలలపాటు కొనసాగించనున్నట్లు తెలిసింది. ప్రతిపక్షంలో ఉన్నపుడు అప్పటి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రజల్లోకి వేగంగా వెళ్లగలిగాం. కానీ, అధికారంలో ఉంటూ ప్రజల్లోకి వెళ్లాలంటే.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంత అనుకూలంగా లేవని వైకాపా ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. పార్టీతోపాటు పార్టీ అనుబంధ విభాగాలు కూడా పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణను ముఖ్యమంత్రి ఈ సమావేశంలో వివరించనున్నట్లు సమాచారం.
మంగళగిరిలో నేడు జగన్ పర్యటన
నేడు మంగళగిరిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా.. జడ్పీ ఛైర్‌పర్సన్ క్రిస్టినా కుమారుడి పెళ్లి వేడుకకి హాజరుకానున్నారు.
ఇదీ చదవండి: తిరుపతిలో అమానవీయం..మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్న అంబులెన్స్ సిబ్బంది