Palnati Veerula Aradhanotsavam Start November 30 To December 4 : అప్పటి పల్నాటి యుద్ధం రాజ్య కాంక్షతో కౌరవ, పాండవులు జరిపిన మహాభారత యుద్ధం తీరును గుర్తుచేస్తుంది. మాయా జూదంలో ఓడిపోయిన పాండవులు అరణ్య, అజ్ఞాత వాసం చేశారు. తరువాత తిరిగొచ్చిన పాండవులు రాజ్యం కోసం రాయభారం నడిపినా సంధి కుదరలేదు. దీంతో యుద్ధం అనివార్యమైంది. అచ్చం పల్నాడు యుద్ధంలోనూ అలాంటి ఘటనలే కనిపిస్తాయి. ఇద్దరు అన్నదమ్ముల మధ్య రాజ్యకాంక్షతో జరిగినే పోరాటమే ఈ పల్నాటి యుద్ధం.
క్రీ.శ.1138లో అనుగురాజు మహాదేవిచర్ల (పల్నాడు జిల్లా మాచర్ల)ను రాజధానిగా చేసుకుని పాలించాడు. అనంతరం ఆయన మృతితో సవతి పుత్రుల మధ్య విభేదాలు వచ్చాయి. మాచర్ల, గురజాల రెండు రాజ్యాలుగా విడిపోయాయి. మలిదేవాదులు మాచర్లను రాజధానిగా ఏర్పాటు చేసుకుని మంత్రి బ్రహ్మనాయుడు (బ్రహ్మన్న) సారథ్యంలో తన పాలన ప్రారంభించాడు. అదేవిధంగా గురజాలను రాజధానిగా చేసుకుని నాగమ్మ సారథ్యంలో నలగాముడు పాలన మొదలు పెట్టారు. ఇద్దరు కూడా ప్రజా సంక్షేమమే కోసం పలు సంస్కరణలకు బీజాలు వేశారు.
కోడిపందేలుతో పొయిన రాజ్యం : ఇలా సాగుతున్న క్రమంలోనే సరదాగా సాగిన కోడిపందేలు ఇరు రాజ్యాల మధ్య ఉన్న వైషమ్యాలను బట్టబయలు చేశాయి. పట్టుదలకు పోయిన ఇద్దరు రాజులు కోడి పందేల పోరుకు దిగారు. క్రీ.శ.1173లో ఇరు రాజ్యాలను పందేలుగా పెట్టారు. నాగమ్మ కుయుక్తితో కోడి పందెంలో గురజాల రాజ్యాన్ని గెలిపించింది. తరువాత మాచర్ల రాజైన మలిదేవాదులు, అతని మంత్రి బ్రహ్మన్నాను అరణ్యవాసంకు పంపించారు. ఏడేళ్లు అరణ్యవాసం, ఏడాదిపాటు అజ్ఞాత వాసం చేశారు. అనంతరం రాజ్యానికి తిరిగి వచ్చి వాళ్ల రాజ్యాన్ని కోరేందుకు అలరాజు ద్వారా జరిపిన సంధి విఫలమైంది. దీంతో క్రీ.శ.1181లో పల్నాటి యుద్ధం అనివార్యమైంది.
తొలిరోజు రాచగావు
పల్నాటి యుద్ధం మొదటి రోజున మేకపోతులను బలిస్తారు. ఈ కార్యక్రమాన్నే రాచగావుగా పిలుస్తారు. ఈ క్రతువును వీర్లదేవాలయ ప్రాంగణంలో ఉన్న కథా మండపంలో ఆచారవంతులు (వీరుల వంశీకులు) చేస్తారు.
రెండోరోజు రాయభారం
మలిదేవ, బ్రహ్మన్నల పరివారం అరణ్య, అజ్ఞాత వాసాలను పూర్తయ్యాక తన మాచర్ల రాజ్యాన్ని తిరిగి ఇవ్వాలంటూ గురజాల రాజు నలగాముడి వద్దకు అలరాజును రాయభారం పంపిస్తారు. తీర ఆ రాయభారి దారి దారి మధ్యలోనే హత్యకు గురికావడంతో పల్నాటి యుద్ధం అనివార్యమవుతుంది. దీన్ని అప్పట్లో జరిగిన సంఘటనను అచ్చం కళ్లకు కట్టినట్లుగా కథా మండపంలో వీరవిద్యావంతులు గానం చేస్తుండగా ఆచారవంతులు కత్తి సేవ చేస్తారు.
మూడోరోజు మందపోరు
మలిదేవ, బ్రహ్మన్న పరివారం అరణ్యవాస కాలంలో నల్లమల అటవీ ప్రాంతమైన మండాది ప్రాంతంలో వారికి అన్నపానీయాలను అందించే ఆవులను మేపుతుంటారు. ఆ ఆవులను చంపేందుకు నాగమ్మ ప్రోద్బలంతో అడవి చెంచులు వచ్చారు. వారిని అడ్డుకునేందుకు లంకన్న భీకరయుద్ధం చేసి చివరికి మృతి చెందుతాడు. ఈ విషయం తెలిసి బ్రహ్మన్న తన పరివారంతో ఆ ప్రాంతానికి చేరుకొగా చెంచులు అక్కడి నుంచి పారిపోతారు. ఈ సమయంలోనే లంకన్నకు శంఖుతీర్థమిచ్చి బ్రహ్మన్న ముక్తి ప్రసాదిస్తాడు. తరువాత కులమతాల రక్కసిని పూర్తిగా రూపుమాపి అందరికీ సమానంగా సహపంక్తి భోజనాలు నిర్వహించే తీరును ప్రత్యక్షంగా చూపిస్తారు.
నాలుగో రోజు కోడిపోరు
పల్నాటి యుద్ధంలో ప్రధానమైన ఘట్టం కోడిపోరు. క్రీ.శ.1173లో రెంటచింతల మండలం పాల్వాయిలో ఉన్న పాడేరు గుట్టలపై మాచర్ల, గురజాల రాజ్య ప్రతినిధులు ఈ ముఖ్యఘట్టం కోడి పోరును నిర్వహించారు. బ్రహ్మనాయుడి ఆధ్వర్యంలో మాచర్ల రాజులు చిట్టిమల్లు అనే కోడితో పోరుకు దిగారు. అలాగే నాగమ్మ నేతృత్వంలో గురజాల రాజు సివంగిడేగతో పోరుకు సిద్దమయ్యారు. ఇలా మూడు దఫాలుగా జరిగిన కోడిపోరులో నాగమ్మ కుయుక్తితో చివరికి సివంగిడేగ గెలుస్తుంది. ఈ తతంగం మొత్తాన్ని వీర్లదేవాలయ ప్రాంగణంలోని కోడిపోరు గరిడీలో నిర్వహిస్తారు.
అయిదో రోజు కల్లిపాడు
క్రీ.శ.1181లో జరిగిన అప్పటి పల్నాటి యుద్ధంలో 66 మంది వీరనాయకులు మరణించారు. అలాగే వందలాది మంది సైనికులు మృతి చెందారు. ఈ వీరనాయకులు మృతి చెందిన తీరును తెలపడమే కల్లిపాడు ఉద్దేశం. ఆచారవంతులు వీరుల ఆయుధాలతో పీఠాధిపతి ద్వారా శంఖుతీర్థం పుచ్చుకుని యుద్ధక్షేత్రానికి వెళ్తారు. అక్కడి పోతురాజు శిల వద్ద ఉన్న తంగెడ మండలపై అందరూ వాలిపోయి యుద్ధంలో మృతి చెందినట్లుగా కళ్లకు కట్టినట్లు చూపుతారు. దీంతో ఆరాధనోత్సవాలు ముగుస్తాయి.
అసువులు బాసిన వారిని స్మరిస్తూ వేడుక
అప్పటి పల్నాటి యుద్ధంలో మృతి చెందిన 66 మంది వీరనాయకులను స్మరిస్తూ ప్రతి సంవత్సరం పల్నాడు జిల్లా కారంపూడిలోని వీరుల దేవాలయం పరిసరాల్లో ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని కార్తిక అమావాస్య నుంచి ఐదురోజులపాటు నిర్వహిస్తారు. అంటే నవంబరు 30 నుంచి డిసెంబరు 4వరకు చేస్తారు. అప్పటి పల్నాటి యుద్ధంకి దారి తీసిన ప్రధాన క్రతువుల పేరున ఈ వేడుకలు జరుపుతారు.
పటిష్ఠ బందోబస్తు మధ్య పల్నాటి వీరుల ఆరాధనోత్సవాలు
పల్నాటి ఉత్సవాల్లో కారంపూడి ఎస్సై వీరంగం - మహిళలు, వృద్ధులపై దాడి