వివిధ రంగాల్లో సేవలందించిన వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే భారతరత్న, పద్మ అవార్డుల తరహాలో రాష్ట్రంలోనూ అత్యున్నత పౌర పురస్కారాలు ఇస్తున్నామని..ముఖ్యమంత్రి జగన్(cm jagan) అన్నారు. కేంద్ర ప్రభుత్వం మాదిరిగా రాష్ట్రంలోనూ అవార్డులు ఇస్తే బాగుంటుందని పలు సూచనలు అందాయని చెప్పారు. అన్నదాతలు, విద్యార్థులు, ప్రతి పేదవాడి కోసం దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి పనిచేశారని.. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైఎస్సార్ సాఫల్య, వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కారాల(ysr lifetime achievement awards)ను ప్రకటించినట్లు సీఎం వెల్లడించారు. విజయవాడలోని ఏ-కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో కలిసి జగన్ పాల్గొన్నారు. మొత్తం 29 మందికి వైఎస్సార్ జీవన సాఫల్య, 30 మందికి వైఎస్‌ఆర్ సాఫల్య పురస్కారాలను ప్రదానం చేశారు.
సంస్కృతి, సంప్రదాయానికి ఇస్తున్న గౌవరం ఇది
మన సంస్కృతి, సంప్రదాయానికి ఇస్తున్న గౌవరం ఇది అని.. పురస్కారాల ప్రదానోత్సవం సందర్భంగా సీఎం జగన్ తెలిపారు. వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కారానికి రూ.10లక్షల నగదు, కాంస్య ప్రతిమ, వైఎస్సార్ సాఫల్య పురస్కారానికి రూ.5లక్షల నగదు, కాంస్య ప్రతిమ అందజేస్తున్నామన్నారు. అవార్డుల ఎంపికలో కులం, మతం, ప్రాంతం, రాజకీయ నేపథ్యం చూడలేదని.. కేవలం మానవత, సేవ, ప్రతిభను గుర్తించి ఎంపిక చేశామని చెప్పారు. వీధి నాటకం, తోలుబొమ్మలు, కూచిపూడి నృత్యం, జానపదం, సేవలు, అన్నదాతలు,కొవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన మానవతా వాదులకు..ఇలా వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి పురస్కారాలు ఇస్తున్నామని జగన్ తెలిపారు. ఇకపై ఏటా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రదానం చేస్తామని సీఎం చెప్పారు.
వివిధ రంగాల్లో అసమాన సేవలందించిన వారిని సత్కరించుకుంటున్నాం: గవర్నర్
రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు పురస్కారాల ప్రదానం చేయడం సంతోషకరమని.. రాష్ట్ర గవర్నర్ బిశ్విభూషణ్ హరిచందన్(governer bishwabushan harichandan) అన్నారు. పురస్కారాలు అందుకుంటున్న వారి కుటుంబసభ్యులకు.. గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. కళలు, సంప్రదాయాలకు ఆంధ్రప్రదేశ్ నిలయమని అన్నారు. వివిధ రంగాల్లో అసమాన సేవలందించి, విశేష ప్రతిభ కనబరిచిన వారిని సత్కరించుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర అవతరణకు కృషిచేసిన పొట్టి శ్రీరాములు సేవలను గవర్నర్ గుర్తుచేశారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవని, వ్యవసాయం, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్‌లోనూ రాష్ట్రం క్రియాశీలకంగా ఉందని అన్నారు. వైఎస్సార్ లైఫ్‌టైమ్ అవార్డులు అందుకున్నవారికి గవర్నర్ అభినందనలు తెలిపారు.
పలువురికి అవార్డుల ప్రదానం
సురభి నాటకాలకు, కూచిపూడి నృత్యానికి, బొబ్బిలివీణల తయారీ కళాకారుడు అచ్యుత నారాయణకు, పద్యనాటక కేంద్రం, తొలుబొమ్మలాట, సవర చిత్రాలు కళాకారుడు రాజు, డప్పు కళాకారుడు మజ్జి శ్రీనివాసరావు, ధర్మాడి సత్యం, హరికథా పాఠశాలకు, నాదస్వరం కళాకారుడు వి.సత్యనారాయణ, కాఫీ తోటల పెంపకానికి సంబంధించి సగ్గే కొండలరావు, తదితరులకు వైఎస్సార్ అచీవ్ మెంట్ ఆవార్డులు ప్రదానం చేశారు. క`విడ్ సేవలందించిన వైద్యులు, నర్సులకు కూడా వైఎస్సార్ అవార్డులతో ప్రభుత్వం సత్కరించింది. తూర్పుగోదావరి జిల్లాలోని మల్లాది సత్యలింగం నాయకర్ ఛారిటీస్, కడపలోని సీపీ బ్రౌన్ గ్రంధాలయం, ప్రకాశం జిల్లా వేటపాలం సారస్వత నికేతన్ లైబ్రరీ, సత్యసాయి సెంట్రల్ ట్రస్టుకు, ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ కు , అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్టుగా అలాగే రాజమహేంద్రవరంలోని గౌతమీ రీజినల్ లైబ్రరీకి, విజయనగరం సంగీత నృత్య కళాశాలకు.. గవర్నర్ చేతుల మీదుగా వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులు ప్రదానం చేశారు. కాళీపట్నం రామారావు (కారామాస్టారు) , కత్తిపద్మారావుకు, బండినారాయణ స్వామికి, రచయిత్రి ఓల్గాకు సాహిత్యం, రచనలకు గానూ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డులు అందుకున్నారు.
ఇదీ చదవండి: సహజ అందాలతో మనసును దోచేస్తున్న మడఅడవులు