జగనన్న వసతి దీవెన తొలివిడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. జగనన్న వసతి దీవెన పథకం కింద 2020–21 సంవత్సరానికి 10,89,302 విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో 1,048.94 కోట్లు జమ చేశారు. జగనన్న వసతి దీవెన పథకం ద్వారా దేశంలో ఏటా రెండు వాయిదాలలో చెల్లింపులు చేయనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఐటీఐ విద్యార్ధులకు 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్ధులకు 15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున వసతి, భోజన, రవాణా ఖర్చుల కోసం ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఇవాళ తొలివిడత సొమ్ము చెల్లిస్తున్నామని, వచ్చే డిసెంబర్ లో రెండో విడత నిధులను విడుదలచేయనున్నట్లు తెలిపారు.
కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి వారి తల్లుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయనున్నట్లు తెలిపారు. జగనన్న వసతి దీవెన పథకం కింద ఇప్పటికే 1,220.99 కోట్లు చెల్లించామన్న సీఎం.. ఇప్పుడు మొదటివిడతగా 1,048.94 కోట్లు ఈ రోజు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పటివరకు వసతిదీవెన కింద 2,269.93 కోట్లు చెల్లించామని వెల్లడించారు. ఇప్పటి వరకూ విద్యారంగంపై వివిధ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసిందన్న సీఎం.. 23నెలల్లో 1 కోటి 60 లక్షల 75 వేల 373 లబ్దిదారులకు 25 వేల 714.13 కోట్లు అందించామన్నారు.
పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి చదువేనన్న సీఎం వైఎస్ జగన్.. పేద పిల్లల తలరాతలు మార్చాలనే తపనతోనే అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. పేద విద్యార్థులు ఉన్నత విద్య చదవాలనే సంకల్పంతో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టామని వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్ అమలు చేస్తున్నామన్నారు.
నాడు- నేడు కింద రాష్ట్రంలో పాఠశాలలు, అంగన్వాడీల రూపురేఖలను మార్చుతున్నామన్నారు. ప్రతి పాఠశాలలో సకల వసతులు కల్పిస్తున్నామన్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కోసం 1800 కోట్లు ఖర్చు చేస్తున్నామని, పిల్లల్లో నైపుణ్యాభివృద్ది పెంపోందించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నాడు నేడు పథకం విద్యా సంస్థల రూపు రేఖలు మార్చి సకల సదుపాయాల కల్పిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీలను ప్రీప్రైమరీ పాఠశాలలుగా మారబోతున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీలలో పిల్లలు, తల్లుల పోషకాహారం కోసం మరో రూ. 1,800 కోట్లు వ్యయం చేస్తున్నామన్నారు. పోటీ ప్రపంచంలో మన పిల్లలు గెలవాలనే సంకల్పంతో ముందడుగు వేస్తున్నామన్నారు. పేద పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించాలనే విద్యా దీవెన, వసతి దీవెన అమలు చేస్తున్నామన్నారు. కొవిడ్ తో రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉందని అయినప్పటికీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పథకాలన్నింటినీ అమలు చేస్తున్నామన్నారు.
మంచి భవిష్యత్తు ఉండాలనే పరీక్షలు...
పదో తరగతి ఇంటర్ పరీక్షల నిర్వహణ పై సీఎం వైఎస్ జగన్ స్పష్టతనిచ్చారు. ఎంత కష్టమైనా పరీక్షలను నిర్వహించి తీరతామన్నారు. కొవిడ్ దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలను నిర్వహిస్తామన్నారు. పరీక్షలపై దేశవ్యాప్తంగా ఒకే పాలసీ లేదని... ఒక రాష్ట్రంలో పరీక్షలు జరుగుతుండగా మరో రాష్ట్రంలో పరీక్షలు జరపడం లేదని సీఎం అన్నారు. పరీక్షలు జరిగిన రాష్ట్రాల్లో విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయని, పరీక్షలు జరపని రాష్ట్రంలో విద్యార్థులకు కేవలం పాసైనట్లు దృవ పత్రాలు ఇస్తారన్నారు. పరీక్షలు జరపకపోతే కేవలం పాస్ సర్టిఫికెట్ తో మంచి కళాశాలలో మన విద్యార్థులకు సీట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. విద్యార్థుల మంచి భవిష్యత్ ఉండాలనే ఉద్దేశంతోనే పరీక్షలు నిర్వహిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. కొవిడ్ దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుని పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తాంమని సీఎం స్పష్టం చేశారు. విపత్కర పరిస్దితుల్లో పరీక్షలపై కొందరు అగ్గి రాజేస్తున్నారని , వాస్తవాలను వక్రీకరించి ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. అందరికీ మంచి జరగాలని, ఎవరూ నష్ట పోకూడదన్నదే ప్రభుత్వ విధానమన్నారు.
డ్రాపవుట్లు గణనీయంగా తగ్గాయి...
రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన పథకాల వల్ల విద్యా రంగంలో డ్రాపవుట్లు గణనీయంగా తగ్గాయని గర్వంగా చెబుతున్నానని సీఎం అన్నారు. గతంలో 18 నుంచి 23 ఏళ్ల మధ్య, ఇంటర్ తర్వాత కళాశాలల్లో చేరుతున్న వారికి సంబంధించిన ‘గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో’ (జీఈఆర్) కేవలం 23 శాతం మాత్రమే ఉండేదన్నారు. అలాంటి దారుణ పరిస్థితి మార్చాలన్న సంకల్పంతోనే ప్రభుత్వం, విద్యా దీవెనతో పాటు, వసతి దీవెన పథకాలకు శ్రీకారం చుట్టిందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: నంద్యాలలో దారుణం.. ఒకే ఇంట్లో నలుగురు ఆత్మహత్య