CJI Justice NV Ramana: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి. రమణ ఓ సదస్సులో.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులతో దిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో శనివారం నిర్వహించిన సదస్సులో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్రశర్మ సీఎస్ తీరును వివరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌లతో ఇటీవల తాను సమావేశమైనప్పుడు న్యాయవ్యవస్థకు సంబంధించిన పలు సమస్యలను వారికి వివరించానని తెలిపారు. వాటిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి.. రెండు రోజుల్లో పరిష్కారానికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్‌ను ఆదేశించారని చెప్పారు. రోజులు గడుస్తున్నా సీఎస్ నుంచి సరైన స్పందన లేదని హైకోర్టు సీజే వివరించారు.
దీనికి స్పందించిన సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ.. ముఖ్యమంత్రి, హైకోర్టు సీజే కలిసి తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకుండా సీఎస్ పెండింగ్‌లో పెట్టడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వ్యక్తిగత పనుల కోసం అడగడం లేదని.. నిర్ణయాలన్నీ న్యాయవ్యవస్థ బలోపేతం కోసం తీసుకునేవేనన్నారు. పలు జిల్లా కోర్టుల్లో కనీస వసతులు లేవని.. విచారణ సమయంలో ఒక న్యాయవాది బయటకు వస్తేనే మరో న్యాయవాది లోపలికి వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.
రాష్ట్ర జ్యుడిషియల్ అథారిటీలో ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని భాగస్వామిగా చేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించారు. దీనికి స్పందించిన సీజేఐ ఎన్.వి.రమణ.. ‘తెలంగాణ ప్రధాన కార్యదర్శి తీరు మీరు విన్నారుగా’ అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమావేశాలకు రారని, వచ్చినా నిర్ణయాలు అమలు చేయరని వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: