CJI NV Ramana On AP Tour: ‘అబ్బాయ్ రమణా! అంటూ మా ఊరి పెద్దల పలకరింపు నన్ను పులకరింపజేసింది. ఆ ఆశీర్వచన భరిత పలకరింపు ముందు అన్ని గౌరవార్థకాలు దిగదుడుపే’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఆశీర్వాద బలమే తనను ఈ స్థాయికి చేర్చిందని, ఆ ఆశీర్వాదాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పర్యటన ముగించుకుని సోమవారం హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ.. పర్యటనలోని మధురస్మృతుల్ని గుర్తు చేసుకుంటూ బహిరంగ లేఖ రాశారు. ‘మా ఊరు పొన్నవరం వెళ్లి అయిన వాళ్లందరినీ పలకరించి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సుప్రీంకోర్టుకు శీతాకాలం సెలవులు ప్రకటించటంతో నా ఆలోచన అమల్లో పెట్టే అవకాశం లభించింది. భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా ఈ నెల 24వ తేదీ ఉదయం ఎంతో ఉత్సుకతతో మా స్వగ్రామానికి సకుటుంబ సమేతంగా బయలుదేరాను. గరికపాడువద్ద ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో కాలు మోపింది మొదలు... అసంఖ్యాకంగా ప్రజలు బారులు తీరి, స్వాగత వచనాలు, నినాదాలు, పూల వాన, అపారమైన ప్రేమాభిమానాలతో ముంచెత్తిన తీరు నేనూ, నా కుటుంబ సభ్యులం ఎప్పటికీ మరువలేము’ అని ఆ లేఖలో వివరించారు. సమయాభావంవల్ల ఎందరినో కలవడం కుదరలేదని, మరోసారి అందరినీ కలిసే అవకాశం త్వరలో వస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
నా చిన్ననాటి జ్ఞాపకాలు తరుముకొచ్చాయ్
బంధుత్వాల కంటే మిత్ర బంధానికే పెద్ద పీట వేసే పొన్నవరం..... ఊరు ఊరంతా మమ్మల్ని స్వాగతించేందుకు తరలివచ్చింది. నన్ను, నా కుటుంబ సభ్యుల్ని ఎడ్లబండి ఎక్కించి పొలిమేరల నుంచే ఊరేగింపుగా తీసుకెళ్లడం నన్ను కదిలించింది. మూలాలు మరవకూడదని నేను బలంగా విశ్వసిస్తాను. మా ఇద్దరు కుమార్తెలకు మరోసారి, ఇద్దరు అల్లుళ్లకు, ఇద్దరు మనవరాళ్లకు తొలిసారి మా ఊరు చూపించడం ఎంతో సంతృప్తినిచ్చింది. పొన్నవరం వీధుల్లో నడుస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు తరుముకొచ్చాయి. ఎందరో ఆప్తులు చాలాకాలం తర్వాత కలిశారు. భావోద్వేగం కట్టలు తెంచుకుంది.
ఎన్నో ఆహ్వానాలు... కొన్నే ఆమోదించగలిగాను
నా... ఊరి ప్రయాణం వార్త బయటకు తెలియగానే ఎన్నో ఆహ్వానాలు అందాయి. అందులో కొన్నే ఆమోదించగలిగాను. భారత ప్రధాన న్యాయమూర్తి హోదాలో రాజధాని ప్రాంతంలో నా తొలి పర్యటనను పురస్కరించుకుని గవర్నరు, ముఖ్యమంత్రి ఆతిథ్యమిచ్చారు. వారిరువురికీ, రాష్ట్ర ప్రభుత్వానికి, తేనీటి విందుకు హాజరైన పెద్దలు, ప్రముఖులు, మంత్రులు, అధికారులందరికీ కృతజ్ఞతలు. సకల జీవన రంగాల వారు, ప్రజాప్రతినిధులు, రాజకీయ, సామాజిక పక్షాల ప్రతినిధులు ఎందరో నన్ను పలకరించేందుకు వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు. న్యాయవాద వృత్తిలో నాకు నడక నేర్పిన బెజవాడ బార్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగుల సంఘం, రోటరీ క్లబ్-విజయవాడ అతి స్వల్ప వ్యవధిలో అసాధారణమైన ఏర్పాట్లతో నన్నూ, నా సతీమణి శివమాలను సత్కారాలతో ముంచెత్తాయి. కొందరు తెలంగాణ నుంచి తరలివచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అహర్నిశలు శ్రమించిన ఈ సంస్థలు, వ్యక్తులకు పేరుపేరునా ధన్యవాదాలు. లావు వెంకటేశ్వర్లు స్మారక ఉపన్యాసమివ్వటానికి నన్ను ఎంపిక చేసిన సిద్ధార్థ న్యాయ కళాశాలకు, కార్యక్రమానికి హాజరైన వారందరికీ కృతజ్ఞతలు. ఈ పర్యటనలో నా వెంట ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల పట్ల మీరు చూపిన గౌరవం, అభిమానం శ్లాఘనీయం. న్యాయవ్యవస్థ, న్యాయమూర్తుల పట్ల తెలుగు ప్రజలు చూపిన గౌరవం చూసి వారెంతో సంతోషించారు.
మీ అభిమానాన్ని, నమ్మకాన్ని వమ్ము చేయను
నా నుంచి ఏమీ ఆశించకుండా, సొంత పనులన్నీ మానుకొని ఎండకూ, వేడికి వెరవక నేను ప్రయాణించిన మార్గంలో గంటల తరబడి వేచి ఉండి.. అడుగడుగునా దీవించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా నమస్సులు. మీరు చూపిన అభిమానాన్ని, నమ్మకాన్ని వమ్ము చేయనని మాట ఇస్తున్నా. భవ్య దర్శన భాగ్యం కల్పించిన విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం, పొన్నూరు శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం, చందోలు శ్రీ బగళాముఖీ అమ్మవారి దేవస్థానం, మా ఊరి ఆలయాల పాలక మండళ్లకు, క్రిస్మస్ పర్వదినం రోజున ఆశీర్వాదాలు అందించిన క్రైస్తవ మత పెద్దలకు ధన్యవాదాలు.
ఏపీలో అడుగిడింది మొదలు మా బాగోగోలు చూసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రోటోకాల్, పోలీసు సిబ్బందికి, రాజ్‌భవన్ అధికారులకు, యావత్తూ అధికార యంత్రాంగానికి మా అందరి తరఫున ధన్యవాదాలు. మా పర్యటన సాఫీగా, సౌకర్యవంతంగా సాగేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిన ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఏపీ ప్రభుత్వానికి, పాత్రికేయులకు ప్రత్యేక ధన్యవాదాలు.
ఈ నెల 24న హైదరాబాద్‌లో బయలదేరినది మొదలు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వరకూ, తిరిగి సోమవారం నాడు ఏపీ సరిహద్దు నుంచి హైదరాబాద్ చేరే వరకూ, సకల సదుపాయాలు కల్పించిన తెలంగాణ పోలీసు సిబ్బందికి, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. తెలంగాణలో ఎలాంటి ప్రకటిత కార్యక్రమాలు లేనప్పటికీ దారిలో ఎందరో న్యాయవాదులు, న్యాయాధికారులు, ప్రజలు మాకు స్వాగతం పలికారు. వారందరికీ అభివందనాలు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణకు సోమవారం సూర్యాపేటలోని సెవన్ హోటల్‌లో నల్గొండ ప్రిన్సిపల్ జిల్లా జడ్జి బి.ఎస్.జగ్జీవన్‌కుమార్, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి ఘనస్వాగతం పలికారు. విజయవాడ పర్యటనను ముగించుకొని హైదరాబాద్‌కు వెళ్తున్న ఆయనకు జిల్లా ఉన్నతాధికారులు తేనేటి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్.వి.రమణ.. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. .
"స్వగ్రామం వెళ్లి మా వాళ్లను పలకరించాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. కోర్టుకు శీతాకాలం సెలవులు ఇవ్వడంతో నాకు అవకాశం దొరికింది. రాష్ట్ర సరిహద్దుల్లోనే ప్రజలు నాకు ఘనస్వాగతం పలికారు. పొన్నవరం వాసులు ఎడ్లబండిపై తీసుకెళ్లటం నన్ను కదిలించింది. పొన్నవరం వీధుల్లో నడుస్తుంటే.. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. అల్లుళ్లు, మనుమరాళ్లకు తొలిసారి మా ఊరు చూపించి సంతృప్తి చెందా. మూలాలు మరిచిపోవద్దు అనేదాన్ని నేను బలంగా నమ్ముతా. విందు ఇచ్చిన సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్‌కు ధన్యవాదాలు. అందిన ఆతిథ్య ఆహ్వానాల్లో కొన్నింటినే ఆమోదించగలిగాను." - ఎన్వీ రమణ, సీజేఐ
ఇదీ చదవండి:
CM Jagan Review On Omicron Variant: ఎలాంటి పరిస్థితులైనా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: సీఎం జగన్