mlc Ashok Babu Arrested: ప్రభుత్వ సర్వీస్‌లో ఉన్నప్పుడు పదోన్నతి కోసం విద్యార్హతను తప్పుగా చూపించారన్న ఆరోపణలపై తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్ బాబును సీఐడీ పోలీసులు గురువారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో పని చేసినప్పుడు బీకాం చదవకపోయినా చదివినట్లు తప్పుడు ధృవపత్రం సమర్పించారని విజయవాడకు చెందిన మెహర్ కుమార్ గతంలో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.
దీనిపై వాణిజ్య పన్నుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకున్న లోకాయుక్త... సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ ఇటీవల అశోక బాబుపై సీఐడీకి ఫిర్యాదు చేయగా.. గత నెల 25న వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులోనే అశోక్ బాబును గత అర్ధరాత్రి అరెస్టు చేసినట్లు నోటీసుల్లో సీఐడీ అధికారులు పేర్కొన్నారు. అశోక్ బాబు అరెస్టు పట్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
అశోక్ బాబును సీఐడీ అధికారులు గుంటూరులోని కార్యాలయానికి తీసుకువచ్చారు. అర్థరాత్రి సమయంలో విజయవాడలోని ఆయన నివాసంలో అశోక్‌బాబును అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు.. ఈరోజు తెల్లవారుజామున గుంటూరు తీసుకువచ్చారు.
హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్..
అశోక్‌బాబు అరెస్టుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. అశోక్‌బాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అశోక్‌బాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
17 గంటలపాటు సీఐడీ కార్యాలయంలో..
అశోక్ బాబును 17 గంటలపాటు గుంటూరు సీఐడీ కార్యాలయంలోనే ఉంచారు. అక్కడే కొవిడ్ పరీక్ష నిర్వహించారు. ర్యాపిడ్ పరీక్షలో అశోక్‌బాబుకు నెగెటివ్ రిపోర్టు వచ్చింది. సాయంత్రం అశోక్‌బాబును విజయవాడ సీఐడీ కార్యాలయానికి తరలించారు. అనంతరం సీఐడీ జడ్జి ఎదుట హాజరుపరిచారు.
రాజకీయ కక్షతోనే కేసు నమోదు: అశోక్ బాబు
తాను ఏ తప్పు చేయలేదని రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కేసు నమోదైందని అశోక్ బాబు జనవరి 26న విలేఖరుల సమావేశంలో వివరణ ఇచ్చారు. తాను ఎమ్మెల్సీ కావడం ఇష్టం లేక, అసూయ వల్ల శాఖ లో ఇష్టం లేని వారు చేసిన పనని ఆరోపించారు. ఉద్యోగుల ఆందోళన సమయంలో తన విద్యార్హతను తెరపైకి తీసుకురావడంలోనే రాజకీయం ఉందని ఆయన విమర్శించారు.
జగన్ సర్కార్ మూల్యం చెల్లించుకోక తప్పదు: చంద్రబాబు
Chandrababu on Ashok babu arrest: ఎమ్మెల్సీ ఆశోక్ బాబు అరెస్టును తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు తీవ్రంగా ఖండించారు. ఎపీ ప్రభుత్వ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. సర్వీస్ మేటర్స్లో తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థ రాత్రి అరెస్టు చెయ్యాల్సిన అవసరం ఏమోచ్చిందని నిలదీశారు. ఉద్యోగుల సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసినందునే అశోక్ బాబుపై ప్రభుత్వం కక్షగట్టిందని చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుకు మూల్యం చెల్లిం చుకుంటుందని హెచ్చరించారు.
పార్టీ అండగా ఉంటుంది: లోకేశ్
Lokesh on Ashokbabu Arrest: అర్ధరాత్రి అక్రమంగా అశోక్ బాబును అరెస్టు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నారా లోకేష్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల కోసం అశోక్ బాబు పోరాడుతున్నందుకే ఈ విధంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. పార్టీ అశోక్ బాబుకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: