కోడిపందేల్లో పాల్గొనని వ్యక్తిని పాల్గొన్నట్లుగా చూపటమే కొందరి జెండా అజెండాగా మారిందని తెదేపా సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ ధ్వజమెత్తారు. ఇంతటి రాక్షస రాజకీయం అవసరమా అని ఆయన మండిపడ్డారు. రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలని.. నీచమైన ప్రచారంతో కాదని హితవు పలికారు. ఇటువంటి నీచమైన ప్రచారంతోనే వైకాపా అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. అసత్యాల వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు కూకటివేళ్లతో ప్రక్షాళన చేసే సమయం దగ్గర పడిందన్నారు. ఆరోజు కోసమే తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. రాక్షస రాజకీయ వికటాట్టహాసానికి త్వరలోనే ముగింపు ఉందని హెచ్చరించారు.
ఏం జరిగిందంటే..: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో కోడిపందేల స్థావరంపై గత రాత్రి పోలీసులు దాడులు చేశారు. చిన్నకంజర్ల శివారులో కోడిపందేలు ఆడుతున్నారనే పక్కా సమాచారం మేరకు డీఎస్పీ భీమ్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు జరిపారు. ఘటనాస్థలంలో 70 మంది ఉండగా.. 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అక్కినేని సతీశ్, కృష్ణంరాజు, శ్రీనులు బృందంగా ఏర్పడి పందేలు ఆడుతున్నారని డీఎస్పీ తెలిపారు. 21 మందిని అదుపులోకి తీసుకొని రూ.13 లక్షల నగదు, 26 వాహనాలు, 27 సెల్ఫోన్లు, 30 కత్తులు, 30 కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. అయితే చింతమనేని ప్రభాకర్, కృష్ణంరాజులు పరారయ్యారని, అక్కినేని సతీశ్, బర్ల శ్రీనులు అదుపులో ఉన్నారని డీఎస్పీ తెలిపారు.
ఇవీ చూడండి