కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని.. ఆపద సమయంలో ప్రజల్లో ధైర్యం నింపాల్సిన బాధ్యత పార్టీ నేతలపై ఉందని తెదేపా అధినేత చంద్రబాబు స్ఫష్టం చేశారు. పార్టీ ఆవిర్బావం దినోత్సవం సందర్బంగా పార్టీ ముఖ్య నేతలతో ఆయన.. టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తోందని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కార్యకర్తల త్యాగాలు మరువలేనివి..
కరోనా మహమ్మారికి రాజు, పేద భేదం లేదని, చికిత్స తర్వాత 19 రోజులకు మళ్లీ పాజిటివ్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రోజుకు లక్ష మందికి పైగా కరోనా సోకుతోందని, ఒకరోగి నుంచి 6 రోజుల్లో 3 వేల 200 మందికి విస్తరించే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలని, భౌతికంగా దూరంగా ఉండాలని, టచ్ పాయింట్స్ తగ్గించాలన్నారు. అన్నివర్గాల ప్రజల్లో అవగాహన పెంచాలని కోరారు. కష్టనష్టాల్లో పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు పాదాభివందనాలు తెలిపారు. హత్యలకు గురైనా, ఆస్తులు కోల్పోయినా వెనుకడుగు వేయకుండా పార్టీకోసం వారు చేసిన త్యాగాలు మరువలేమన్నారు.
తెదేపా నాయకులు విరాళాల వితరణ
రాష్ట్రంలో ఐదేళ్లలో లక్షల కోట్లతో అభివృద్ది పనులు చేపట్టామని.. ప్రభుత్వం గత 11 నెలలుగా ఆయా పనులన్నీ ఆపేసి... రాష్ట్రాన్ని అంధకారంలో ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతలు ఉపాధి అవకాశాలను దెబ్బతీసి.. పెట్టుబడులన్నీ తరిమేశారని మండిపడ్డారు. తెదేపా కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులతో వేధిస్తున్నారని, అయినా భయపడకుండా పార్టీకి వెన్నంటి నిలబడ్డారన్నారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారి నిరోధ చర్యల నిమిత్తం రెండు తెలుగు రాష్ట్రాల తెదేపా నేతలు విరాళాలు ప్రకటించారు. తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ పీఎం సహాయ నిధికి, సీఎం సహాయ నిధికి లక్షరూపాయల చొప్పున విరాళం ప్రకటించారు. గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షులు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రూ. 5 లక్షలు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం ప్రకటించారు.
ఇవీ చదవండి: