వెనక్కి తగ్గొద్దు
పంచాయతీ ఎన్నికల పోలింగ్, జిల్లాల్లో చోటు చేసుకుంటున్న పరిణామలపై నేతలతో టెలికాన్ఫెరెన్సు నిర్వహించిన చంద్రబాబు క్షేత్రస్థాయి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలపాలని ఆదేశించారు. కేసులు పెట్టినా, జైలుకి వెళ్లినా వెనక్కి తగ్గకుండా తెదేపా నేతలు పోరాడుతున్నారన్నారు. పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ఎవరూ విశ్రమించవద్దని స్పష్టం చేశారు. అందరూ పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం విశాఖ ఉక్కుని కాపాడి తీరాలని చంద్రబాబు తేల్చిచెప్పారు.
పోలీసులు అక్రమ నిర్బంధాలు..
ఓటమి భయంతోనే హోం మంత్రి నియోజకవర్గంలో వైకాపాకు మద్దతుగా పోలీసులు అక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం గరికపాడు గ్రామంలో సర్పంచ్ గా పోటీచేస్తున్న అభ్యర్థి భర్త సునీల్ కుమార్, తెదేపా మండల అధ్యక్షుడిని పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇటువంటి అప్రజాస్వామిక విధానాలకు వైకాపా దిగటం అనైతికమన్నారు. తక్షణమే తెదేపా నేతలను విడిచిపెట్టి నిష్పాక్షికంగా, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
వైకాపా నేతలపై చర్యలు తీసుకోవాలి
చిత్తూరు జిల్లా రామకుప్పం ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్లు పరిశీలన సందర్భంగా దౌర్జన్యం చేసిన వైకాపా నేతలపై చర్యలు తీసుకోవాలని తెదేపా అధినేత డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే గెలవటం అసాధ్యమనే వైకాపా బెదిరింపులు, దౌర్జన్యాలకు దిగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. నామినేషన్ల స్క్రూటినీ సమయంలో అధికారులను వైకాపా నేతలు బ్లాక్‌మెయిల్ చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పెకిలించే విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టరు. పౌరులంతా నిర్భయంగా ఎన్నికల్లో పాల్గొనాలని కోరారు.
అధికారులే సహకరిస్తున్నారు
ఎంపీడీఓ దివాకర్ రెడ్డి, ఎస్ఐ సహదేవి, ఎమ్మెల్యే బంధువు భాను, అతని పీఏ హేమంత్ కుమార్‌పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు చంద్రబాబు ఫిర్యాదు చేశారు. పోటీదారుల నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసినా ఇంతవరకు జాబితా ప్రకటించలేదన్నారు. ప్రతిపక్ష పార్టీ బలపర్చిన అభ్యర్థులను పోటీ నుంచి తప్పించే ఉద్దేశంతో ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి జాబితా ప్రకటించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇందుకు ఎంపీడీఓ దివాకర్ రెడ్డి, ఎస్సై సహదేవి సహకరిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పోటీదారుల జాబితా వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. శాంతియుత ఎన్నికల నిర్వహణకు అదనపు పోలీసు బలగాలను కేటాయించాలని కోరారు. కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అచ్చెన్నకు ఫోన్
బెయిల్‌పై విడుదల అయిన అచ్చెన్నాయుడుని చంద్రబాబు ఫోన్ ద్వారా పరమర్శించారు. అక్రమ కేసులతో బలహీనవర్గాలకు చెందిన నేతలను వేధిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు త్వరలో బుద్ధి చెబుతరాని హెచ్చరించారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే అచ్చెన్నాయుడుపై జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. జగన్‌రెడ్డి ప్రజాక్షేత్రంలో తెలుగుదేశంపార్టీ నేతలను ఎదుర్కోలేక పోలీసు వ్యవస్థను స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ అక్రమ కేసులు, దౌర్జన్యాలతో వేధిస్తున్నారన్నారని విమర్శించారు. ప్రజా క్షేత్రంలో పోరాడే నేతలే చిరస్థాయిగా నిలిచిపోతారని చంద్రబాబు అన్నారు.
ఇదీ చదవండి: 'బెదిరించానని నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా'