'కొవిడ్ వ్యాప్తి, ప్రజా ప్రతినిధుల బాధ్యత' అనే అంశంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన వెబినార్‌లో చంద్రబాబు పాల్గొన్నారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్ సహా ప్రజలందరికీ టీకాలు అందాలన్నారు. 'ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రెండో దశ ఆందోళన కలిస్తోంది. రోజువారీ కేసుల నమోదులో ఆంధ్రప్రదేశ్ దేశంలో 5వ స్థానంలో ఉండటం దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. కరోనా నిబంధనలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రాకింగ్‌పై కేంద్ర మార్గదర్శకాలను ప్రభుత్వం పాటించకపోవడం వల్లే పరిస్థితి మరింత తీవ్రమైంది. కరోనా మొదటి దశలో ఎలాంటి వ్యూహం లేకుండా వ్యవహరించిన రీతిలోనే రెండో దశలోనూ ఏపీ ప్రభుత్వం ఉండటం బాధాకరం. విపత్తులను ఎదుర్కోవటంలోనే నాయకత్వ సామర్థ్యం బయటపడుతుంది. విపత్తు సమయంలో నాయకులు ప్రజలకు అండగా నిలబడటంతో పాటు వారికి సరైన మార్గనిర్ధేశం చేయాలి. వ్యాక్సిన్ ఫ్రంట్ లైన్ యోధులతో పాటు ప్రజలందరికీ అందేలా చర్యలు తీసుకోవాలి. కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తూనే వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేయటం ద్వారా వైరస్‌ను అరికట్టవచ్చు' అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
వైద్య రంగంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వాలు దృష్టి సారించాలని చంద్రబాబు అన్నారు. పారామెడికల్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ విధులు నిర్వర్తించేలా ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: కరోనాతో మరో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు మృతి