కృష్ణా జిల్లాలో ఇటీ️వల మున్సిపల్ ఎన్నికలు జరిగిన కొండపల్లి, జగయ్యపేట పురపాలక విజేతలు, పార్టీ నాయకులతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించారు. కొండపల్లిలో పార్టీ విజయానికి కృషి చేసిన నేతలను అభినందించారు. కొన్ని నియోజకవరాల్లో సమర్థుల్ని ప్రోత్సహించకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయని అన్నారు. ఇకపై అలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి మరీ స్థానిక ఎన్నికలు నిర్వహించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రభుత్వ వైఫల్యాలను బలంగా జనంలోకి తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు. జనంతో మమేకమయ్యే నేతలకు పార్టీలో తగిన గుర్తింపు ఇస్తామన్నారు.
జగ్గయ్యపేటలో డబ్బు, అధికార బలం, ప్రలోభాలతో వైకాపా గెలిచిందని చంద్రబాబు ఆరోపించారు. తెలుగుదేశం అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్న వార్డుల్లోనూ రీకౌంటింగ్‌కు అవకాశం లేకుండా చేశారని ధ్వజమెత్తారు. అక్రమాలతో వైకాపా గెలిచినా... నైతిక విజయం తెలుగుదేశం పార్టీదే అన్నారు. వైకాపా అక్రమాలను ఎదిరించి పోరాడారంటూ పార్టీ నాయకులను చంద్రబాబు అభినందించారు. ఇకపైనా అదే దూకుడు కొనసాగించాలన్నారు.
ఇదీ చదవండి: sports authority: విద్యార్థులు క్రీడల వైపు మళ్లేలా క్రీడా ప్రాధికార సంస్థ ప్రణాళికలు