మొండికెత్తిన వైకాపా ప్రభుత్వాన్ని దించి.. రాష్ట్రాన్ని రిపేరు చేయాల్సిన సమయం వచ్చిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజలు అవస్థలు పడుతుంటే తాడేపల్లి ప్యాలెస్ లో పైశాచిక ఆనందం పొందుతున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు అంతా సమష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో తాడేపల్లిగూడెం నియోజకవర్గ నేతలతో చంద్రబాబు భేటీ(CHANDRABABU NAIDU MEETING WITH PARTY LEADERS) అయ్యారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా విధ్వంసం, రాక్షస పాలనే నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి నిలిచిపోయిందని.. సంక్షేమం పేరుతో పెద్దఎత్తున దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. జరుగుతున్న అక్రమాలపై మాట్లాడినా.. ప్రశ్నించినా ప్రస్తుత ప్రభుత్వం కేసులతో నోరు మూయించేయత్నం చేస్తోందని చంద్రబాబు అన్నారు. కానీ.. తెదేపా ఇటువంటి చర్యలకు బయపడబోదని ఆయన తేల్చి చెప్పారు.
వైకాపా ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని.. వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పెట్టుబడి రాయితీ, పంట నష్టం పరిహారాల చెల్లింపులు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయని చెప్పారు. కేవలం 30 శాతం నష్టపరిహారం చెల్లించి మమ అనిపిస్తూ, ప్రచార ఆర్భాటం చేసుకుంటున్నారని మండిపడ్డారు. అప్పుల బాధ తాళలేక రైతులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి నెలకొందని అన్నారు. విత్తనాలు సరిగా పంపిణీ చేయకపోవటంతో దిగుబడి కూడా తగ్గిపోతోందని వెల్లడించారు.
నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా బాబ్జీని నియమించాక పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చిందని అన్నారు. పరిషత్, స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారని వారిని అభినందించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు సాధించాలని ప్రోత్సహించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ రెండు సీట్లు గెలిపించుకుని రాష్ట్రాన్ని కాపాడుకోవాలని దిశానిర్థేశం చేశారు.
ఇదీ చదవండి: