ఎంపీ రఘురామకృష్ణరాజుని అక్రమంగా అరెస్టు చేశారని.. తెదేపా అధినేత చంద్రబాబు, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖలు రాశారు. రఘురామకు వైకాపా ప్రభుత్వం, పోలీసుల ద్వారా ప్రాణహాని ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీ ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చంద్రబాబు ఆ లేఖల్లో కోరారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు లోక్‌సభ ఎంపీని సాధారణ నేరస్థుడిలా అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. సీఎం జగన్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఎంపీ రఘురామ దిల్లీ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే.. కోర్టు ఆదేశాలతో ఆయనకు వై కేటగిరి భద్రత వచ్చిందన్నారు.
జగన్ ప్రభుత్వానికి ఇలాంటివి కొత్తేమీ కాదు
ప్రతిపక్షాలు నిరసన తెలపడం ప్రమాదమని భావించడమంటే ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలను తప్పుగా అర్థం చేసుకోవడమేనని చంద్రబాబు అన్నారు. ఎంపీని అక్రమంగా అరెస్ట్ చేసి, చిత్ర హింసలకు గురి చేయడం నిరసన గళాన్ని అణగదొక్కడమేనన్నారు. జగన్ ప్రభుత్వానికి ఇలాంటివి చేయడం కొత్తేమీ కాదని విమర్శించారు.
థర్డ్ డిగ్రీ పద్ధతులను ఉపయోగించి హింసించారు
ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు తర్వాత ఆయనను సీఐడీ పోలీస్ స్టేషన్ లో థర్డ్ డిగ్రీ పద్ధతులను ఉపయోగించి హింసించారని.. అర్ధరాత్రి ముసుగు ధరించిన ఐదుగురు వ్యక్తులు ఆయన వద్దకు వెళ్లి లాఠీలతో కొట్టారని లేఖలో ఆరోపించారు. రఘురామ మళ్లీ తన కాళ్ల మీద నిలబడలేనంతగా కస్టోడియల్ హింసకు పాల్పడ్డారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రతీకార మనస్తత్వంతో, ప్రతిపక్ష సభ్యులను హింసించడానికి, అసమ్మతిని అణగదొక్కడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రఘురామ ప్రాణానికి ప్రమాదం ఉందని రాజు భార్య రమాదేవి భయపడుతున్నారని లేఖలో వివరించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రాణాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: