తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై తప్పుడు కేసులు బనాయించడాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. శ్రీకాకుళం జిల్లాలో తెదేపా నేత కూన రవికుమార్, నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ఎమ్మెల్యేలు జర్నలిస్టులపై దాడులు చేసినా ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. రాజధానిని తరలిస్తున్నామనే ప్రచారంతో... పెట్టుబడులను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.
గ్రామ వాలంటీర్ల పోస్టుల కోసం రూ.20వేల నుంచి రూ.40వేల వరకు చెల్లించామని ఎంపికైన అభ్యర్థులు చెబుతున్నారని... తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. వైకాపా కార్యకర్తలకు ఉపాధి కల్పించేందుకే... లక్షలాది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తున్నారని ఆరోపించారు. వైకాపా నేతల బెదిరింపులు, వేధింపులకు తట్టుకోలేక ఆశావర్కర్లు, క్షేత్రసహాయకులు, అంగన్వాడీ వర్కర్లు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉన్న ఉద్యోగులను తొలగించి... వారి స్థానాల్లో వైకాపా కార్యకర్తలను నింపడాన్ని ఆక్షేపించారు. ఇంత పెద్దఎత్తున రాష్ట్రంలో చిరుద్యోగులు రోడ్లెక్కి ఆందోళనలు చేయడం వారిలో నెలకొన్న అభద్రతకు అద్దం పడుతోందన్నారు. శివరామకృష్ణన్ కమిటికి వచ్చిన 4వేల 728 మెయిల్స్‌లో 2వేల 171మంది విజయవాడ-గుంటూరుకే ఓట్లు వేసిన విషయం గుర్తుచేశారు. ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటుకు ప్రజల్లో సానుకూలతకు ఇదే నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇదీ చదవండీ...వైకాపా విధానాలు గందరగోళం... ఆందోళనలో ప్రజలు