ముఖ్యమంత్రి జగన్ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మాని ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అకారణంగా తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తున్న జగన్‌కి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. బీసీ జనార్దన్ రెడ్డితో పాటు ఇతర తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయించి, అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. కరోనాను నియంత్రించేదాని కన్నా ప్రతిపక్షాలను నియంత్రించడమే లక్ష్యంగా జగన్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వైకాపా పాలన మూడు అక్రమ కేసులు ఆరు అరాచకాలు అన్నట్లుగా సాగుతోందని ఎద్దేవా చేశారు. దాడికి పాల్పడ్డ వైకాపా నేతలను వదలిపెట్టి దాడిని అడ్డుకున్న జనార్దన్ రెడ్డిని అరెస్టు చేయడం దారుణమన్నారు. తెదేపా నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: