ప్రజల స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని ప్రభుత్వానికి సూచించారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన తెదేపా విస్తృత స్థాయి సమావేశంలో వైకాపా ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. "మంచిగా పనిచేస్తే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం అనుకున్నాం. ప్రభుత్వం విధ్వంసకరంగా పనిచేస్తున్నందున పోరుబాట పట్టక తప్పదు. జగన్ పులివెందుల పంచాయితీలు రాష్ట్రంలో చేయనివ్వం. బదిలీలు, ఇతర ఒత్తిళ్లకు లొంగి... వైకాపా దాడుల పట్ల పోలీసులు ఉదాసీనంగా ఉండటం తగదు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలిపివేశారు. తెదేపా హయాంలో ఉచిత ఇసుక అమలుచేస్తే... ఎన్నో విమర్శలు చేసిన వారే... ఇప్పుడు అధిక ధరకు ఇసుక అమ్ముతున్నారు. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది ఇసుక దోపిడీ ఎవరు చేస్తున్నారనేది. అనేక సంక్షేమ పథకాలు రద్దు చేయడమే కాక... పేదవాడికి రూ.5కు అన్నం పెట్టే అన్న కాంటీన్లు మూసేశారు" అని చంద్రబాబు మండిపడ్డారు. అన్నిటిపైనా పోరాట కార్యాచరణ రూపొందించుకుందామని నేతలకు సూచించారు.
రాష్ట్రం నుంచే నీటిని తీసుకెళ్లాలి
గోదావరి నీటిని తెలంగాణ భూభాగంలోకి తీసుకెళ్లి అక్కణ్నుంచి శ్రీశైలానికి తెస్తామనడం సరికాదని చంద్రబాబు ఆరోపించారు. జగన్, కేసీఆర్ ఆంధ్రాకు అన్యాయం చేసే ఆలోచనలు చేస్తున్నారని విమర్శించారు. మన భూభాగం నుంచే నీటిని వినియోగించే ప్రాజెక్టుకు ఆలోచనలు చేయాలని సూచించారు. 450 కిలోమీటర్లు నీటిని తీసుకుపోవడం ప్రజల సెంటిమెంట్‌కు సంబంధించిన విషయమని.. ఇద్దరు ముఖ్యమంత్రులు అనుకుని చేసే కార్యక్రమం కాదని అన్నారు. స్వార్థ నిర్ణయాలతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయొద్దని చెప్పారు.