గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం తాటపూడి రిటర్నింగ్ అధికారి వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారంటూ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు తెదేపా అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఇటూరి కృష్ణవేణి, పోమేపల్లి ప్రభావతి, సోమేపల్లి లక్ష్మి నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు.. ఈ నెల 8న ఫాం 8ని ఆయన విడుదల చేసి నోటీస్ బోర్డులో ప్రదర్శించారన్నారు. సర్పంచిగా ఇటూరి అరుణ అనే మహిళా అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు గ్రామస్థులందరూ దృవీకరించుకున్నట్లు తెలిపారు.
తరువాత వైకాపా ప్రలోభాలకు తలొగ్గిన ఆర్వో.. అకస్మాత్తుగా ఫాం9 విడుదల చేసి సోమేపల్లి లక్ష్మీ పోటీలో ఉన్నట్లు ప్రకటించారని లేఖలో పేర్కొన్నారు. ఫాం8లో లేని పేరు ఫాం9లోకి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. రిటర్నింగ్ అధికారి అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టమవుతోందని.. తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆ సీఐ, ఎస్‌ఐలపైనా చర్యలు తీసుకోండి...
నరసరావుపేట రూరల్ సీఐ అచ్చయ్యతో పాటు రొంపిచర్ల ఎస్ఐ... ఎన్నికల్లో బెదిరింపులకు పాల్పడుతున్నారని లేఖలో చంద్రబాబు ఆరోపించారు. వారిపైనా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. వార్డు సభ్యుడిగా నామినేషన్ వేసిన అన్నవరం రైతు కోటేశ్వరరావుపై పోలీసులు జలుం ప్రదర్శించారని.. బాధితుడి తాలూకు వీడియోను ఫిర్యాదుకు జత చేశారు. ఈ నెల 9 అర్ధరాత్రిలో ఐదుగురు కానిస్టేబుళ్లతో కలిసి కోటేశ్వరరావు ఇంటిపై సీఐ, ఎస్ఐ దాడి చేసి దుర్బాషలాడారని తెలిపారు. వారి దుశ్చర్యను వీడియో తీస్తున్న ఆ రైతు భార్య అనూష ఫోన్ లాక్కుని పోలీసులు పగులగొట్టారన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకుని.. కోటేశ్వరావు కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. స్వేచ్ఛగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: