Amit Ahah in Munugode Meeting: తెలంగాణలోని మునుగోడు అభివృద్ధికి మోదీ సర్కారు కట్టుబడి ఉంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మునుగోడులో నిర్వహించిన భాజపా సమరభేరిలో పాల్గొన్న అమిత్‌షా.. రాజగోపాల్‌రెడ్డిని కాషాయ కండుపా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరడం అంటే ఒక నాయకుడు చేరినట్లు కాదని.. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఇదే నాంది అని వివరించారు. తెలంగాణలో భాజపా సర్కార్ వచ్చి తీరుతుందని ఉద్ఘాటించిన అమిత్‌షా.. ప్రభుత్వం ఏర్పడ్డాక సెప్టెంబర్ 17ను ఉత్సవంగా జరుపుతామని వెల్లడించారు. ఎన్నికల్లో తెరాసకు ఓటేస్తే.. ఎన్నిసర్లయినా కేసీఆర్ లేదా కేటీఆర్ సీఎం అవుతారు కానీ.. దళితుడు ముఖ్యమంత్రి కాలేడన్నారు. కేసీఆర్, ఆయన కుమారుడు, కుమార్తె, అల్లుడు పదవుల్లో ఉంటే తమకు బాధ లేదన్న అమిత్‌షా.. వారి కుటుంబ పాలన వల్ల ప్రజలు ఎందుకు బాధ పడాలని ప్రశ్నించారు.
"రాజగోపాల్‌రెడ్డి పార్టీలో చేరడం అంటే ఒక నాయకుడు చేరినట్లు కాదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించి సముద్రంలో పారేసేందుకు ఇది ప్రారంభం. రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ ప్రభుత్వం మాయం అవుతుంది. మజ్లిస్‌కు భయపడి విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ జరపడం లేదు. తెలంగాణలో భాజపా ప్రభుత్వం వచ్చితీరుతుంది. భాజపా ప్రభుత్వం వచ్చాక సెప్టెంబరు 17ను ఉత్సవంగా జరుపుతాం. కేంద్రం నిర్మించే మరుగుదొడ్లను కేసీఆర్‌ను అడ్డుకుంటున్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారా? తెరాసకు ఓటు వేస్తే.. ఎన్నిసార్లయినా కేసీఆర్ సీఎం అవుతారు తప్ప దళితుడు కాదు. హుజురాబాద్‌లో చెప్పిన దళితబంధు ఎన్ని కుటుంబాలకు ఇచ్చారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఇచ్చారా? రైతులను కేసీఆర్ తీవ్రంగా మోసం చేస్తున్నారు. పీఎం ఫసల్ బీమాను తెలంగాణలో అమలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే ప్రతి ధాన్యం గింజను కొంటాం. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారింది. అన్ని రాష్ట్రాలు రెండుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తే కేసీఆర్ తగ్గించలేదు. కేసీఆర్ వైఖరి వల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ ధర తెలంగాణలోనే అధికంగా ఉంది." - అమిత్ షా, కేంద్ర హోం శాఖ మంత్రి
ఇవీ చూడండి: