తెలుగు రాష్ట్రాల సీఎస్‌లతో.. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వాల వాదనలు, విభజన సమస్యలను.. ఇరు రాష్ట్రాల సీఎస్‌లు కేంద్రానికి వివరించారు.
ఆంధ్రప్రదేశ్ విభజనచట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన అనేక అంశాల్ని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్. సమీర్ శర్మ మరోమారు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ నేతృత్వంలో జరిగిన దృశ్యమాధ్యమం సమావేశంలో తెలంగాణ సీఎస్‌తో కలిసి పాల్గొన్న ఆయన.. గ్రీన్ ఫీల్డు క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్సు ఏర్పాటు, పోలవరం నిధుల సహా తెలంగాణ చెల్లించాల్సిన రూ.6 వేల కోట్ల విద్యుత్ బకాయిల అంశాల్ని ప్రస్తావించారు.
2014-15 ఏడాదికి సంబంధించిన రిసోర్సు గ్యాప్ ఫండింగ్ నిధులు సమకూర్చాల్సిన అవసరాన్ని.. అజయ్ భల్లా దృష్టికి తెచ్చినట్లు సమీర్‌శర్మ తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, గ్రీన్ ఫీల్డు క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్సు ఏర్పాటుకు సంబంధించిన అంశాలను ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. కడప స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు చర్యలు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తీర్చి దిద్దాల్సిన ఆవశ్యకత వివరించినట్లు సీఎస్ వెల్లడించారు. దుగ్గరాజు పట్నం ఓడరేవుకు బదులుగా రామాయపట్నం రేవు అభివృద్ధి, విశాఖపట్నం-చైన్నైపారిశ్రామిక నడవా, కేంద్రం నుంచి రావాల్సిన పన్ను రాయితీలు తదితర అంశాలను హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా దృష్టికి తెచ్చినట్లు సీఎస్ వివరించారు.
వివిధ ద్వైపాక్షిక అంశాలపై సమీక్ష
ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వివిధ ద్వైపాక్షిక అంశాలపై సమీక్ష నిర్వహించగా.. ప్రధానంగా 10 ద్వైపాక్షిక అంశాలు, 8 ప్రాజెక్టులు, ఇతర అజెండా అంశాలు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా షెడ్యూల్ 9,10లలో పేర్కొన్న సంస్థలలకు సంబంధించిన వివాదాలు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ హెవీ మెచినరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ అంశాలపై కేంద్రం దృష్టి సారించింది.
ఆంధ్రప్రదేశ్ భవన్,ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్ 50,51, 56లో పేర్కొన్న విధంగా పన్ను బకాయిలు,పన్ను రీఫండ్ అంశాలపైన సమీక్షించారు. అదే విధంగా పునర్విభజన చట్టంలో ఎక్కడా చేర్చని ఇనిస్టిట్యూషన్ల ఎపాయింట్మెంట్, డివిజన్ ఆఫ్ క్యాష్ బ్యాలెన్సు, బ్యాంకు డిపాజిట్లు, తెలంగాణా డిస్కం, ఏపీ జెన్కోకు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల అంశాలపైన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఇరువురు సీఎస్ లతో సమీక్షించారు.
తెలంగాణ సీఎస్ వాదనలు
మరోవైపు తెలంగాణ సీఎస్ తమ వాదనలు కేంద్రానికి వినిపించారు. తెలంగాణ నుంచి 3 వేల 442 కోట్ల బకాయిలు ఇప్పించాలంటూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో కేసు వేసిందని.. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి తమకే 12 వేల 111 కోట్ల రూపాయలు బకాయిలు రావాల్సి ఉందని పేర్కొన్నారు. కోర్టు కేసును.. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు ఉపసంహరించుకుంటే ఈ అంశాన్ని పరిష్కరించుకునేందుకు.. సిద్ధమని పేర్కొంది. 9వ షెడ్యూల్‌లోని సంస్థలకు సంబంధించి.. డెక్కన్ ఇన్‌ఫ్రాస్టక్చర్ ల్యాండ్ లిమిటెడ్‌కు కేటాయించిన 5 వేల ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్‌కు సంబంధించిన 250 ఎకరాలపై ఏపీ సర్కార్ కోర్టు కేసులు ఉపసంహరించనంత వరకు పురోగతి సాధ్యంకాదని.. తెలంగాణ తెలిపింది.
విభజన చట్టం ప్రకారం సింగరేణి కాలరీస్‌లో 51 శాతం వాటా తెలంగాణకు, 49శాతం వాటా కేంద్రానికి చెందుతుందని తెలంగాణ అధికారులు తెలిపారు. ఏపీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ హెవీమెష।నరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ సింగరేణి అనుబంధ సంస్థగానే కొనసాగుతుందని తెలంగాణ సర్కార్ స్పష్టంచేసింది. ఏపీ ఉన్నత విద్యా మండలి విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. కేంద్రం ఇచ్చిన ఆదేశాలే పదో షెడ్యూళ్లలోని ఇతర సంస్థలకు వర్తిస్తుందని.. తెలంగాణ వివరించింది. ఏపీ భవన్ విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల అధికారులతో వేసిన కమిటీ.. నివేదిక రావాల్సి ఉందని పేర్కొంది.
ఇదీ చదవండి: ఒమిక్రాన్‌పై కొవాగ్జిన్ ప్రభావవంతంగా పనిచేస్తోంది: భారత్ బయోటెక్