రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఖరిని కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టింది. డీపీఆర్‌లో కనీస ప్రాథమిక అంశాలు లేవన్న కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ... సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించి సమర్పించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సంచాలకులు ముఖర్జీ ఏపీ జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ కు లేఖ రాశారు.
మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన డీపీఆర్ ను నవంబర్ 16వ తేదీన ఎలక్ట్రానిక్ విధానంలో డిసెంబర్ మూడో తేదీన వాటి ప్రతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించింది. డీపీఆర్ ప్రతులను పరిశీలించిన కేంద్ర జలశక్తిశాఖ.. 46 పేజీల డాక్యుమెంట్ లో కనీస, ప్రాథమిక అంశాలైన హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర అంశాలు, ఇరిగేషన్ ప్లానింగ్, డిజైన్, కాస్ట్ ఎస్టిమేట్ అంశాలు లేవని పేర్కొంది. ఈ నేపథ్యంలో టెక్నో -ఎకనామిక్ ఫీజబీలిటీ నిర్ధారణ కోసం డీపీఆర్ ను ప్రిలిమినరీ అప్రైజల్ కూడా చేసే పరిస్థితి లేదని అభిప్రాయపడింది. నీటిపారుదల, బహుళార్థక ప్రాజెక్టుల డీపీఆర్ ల తయారీ మార్గదర్శకాలు కేంద్ర జలసంఘం వెబ్ సైట్ లో ఉన్నాయని... అందుకు అనుగుణంగా సరైన డీపీఆర్ ను రూపొందించి సమర్పించాలని తెలిపింది. డీపీఆర్ ల సమర్పణ కోసం కూడా కేంద్ర జలసంఘం వెబ్ సైట్ లో ఉన్న మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. ఏపీ ఈఎన్సీకి లేఖ రాసిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సంచాలకులు ఆ ప్రతిని ఏపీ జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి, కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ కు పంపారు.
ఇదీ చదవండి: అమరావతిపై రెఫరెండానికి రెడీ..ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటా: చంద్రబాబు