ముఖ్యమంత్రి అసమర్థత, అధికారుల నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో ఆక్సిజన్ అందక ఇప్పటి వరకూ 76మంది చనిపోయారని...ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. బాధిత కుటుంబాలన్నింటికీ 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం సహా కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ ముఖ్యనేతలు, మండల పార్టీ అధ్యక్షులతో ఆన్లైన్లో సమావేశమైన చంద్రబాబు...తిరుపతి రుయా ఆస్పత్రి విషాదంలో 29 మంది వరకూ చనిపోయి ఉండొచ్చనే వార్తలు వస్తున్నాయన్నారు. వాస్తవాలు బహిర్గతం చేసేందుకే నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తే... ఆస్పత్రిలోకి అధికార పార్టీ నేతల్ని అనుమతిస్తూ, తెదేపా నాయకులు, సీపీఐ నేత నారాయణను ప్రభుత్వం అరెస్టు చేయటంపై మండిపడ్డారు.
'మీకో చట్టం..మాకో చట్టమా'
ప్రతిపక్షానికి ఓ చట్టం, అధికార పార్టీ నాయకులకు మరో చట్టం ఎలా అమలు చేస్తారని నిలదీశారు. ఆక్సిజన్ కొరత పరిష్కారానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని తమిళనాడు 4 వందల నుంచి 12 వందల మెట్రిక్ టన్నులకు పెంచుకోగా..కేరళ మిగులు ఆక్సిజన్ సాధించిందన్నారు. రాష్ట్రం మాత్రం ఇతర రాష్ట్రాలపై ఆధారపడుతుండటం ప్రభుత్వ అసమర్థతేనని దుయ్యబట్టారు. ఆక్సిజన్ అందక మరణించిన రోగుల కుటుంబాలకు సంఘీభావంగా ఇవాళ సాయంత్రం ఇళ్ల వద్ద కొవ్వొత్తులతో నిరసనలు తెలపాలని పిలుపిచ్చారు.
చిట్టచివరన ఏపీ
ప్రభుత్వ ప్రణాళికా లోపం వల్లే టీకా పంపిణీలో దేశంలోనే చిట్టచివరి స్థానంలో రాష్ట్రం ఉందని చంద్రబాబు ధ్వజమెత్తారు. సీఎం జగన్ మూర్ఖపు ఆలోచనలు, అవగాహనా రాహిత్యం, ప్రణాళిక లేమి...రాష్ట్ర ప్రజలకు శాపంగా మారాయన్నారు. ప్రజలకు వ్యాక్సిన్లు ఇచ్చేందుకు రాష్ట్రాలన్నీ పోటీ పడుతుంటే... తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులపైనే సీఎం జగన్ శ్రద్ధ పెట్టారన్నారు. దీర్ఘకాలం పోరాడాల్సిన భయంకరమైన వైరస్‌కు టీకా మాత్రమే పరిష్కారం అనేది ముఖ్యమంత్రి విస్మరించారన్నారు. ప్రభుత్వానికుండే విస్తృత అధికారాలను ఆపత్కాలంలో సద్వినియోగం చేసుకోవటంలో సీఎం విఫలమయ్యారని విమర్శించారు. కరోనా కట్టడికి సమష్టి కృషితో పని చేసేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించలేదన్నారు.
లేఖలతోనే కాలక్షేపం
ఇతర రాష్ట్రాలు పెద్దమొత్తంలో వ్యాక్సిన్లు కొనుగోలు చేస్తుండగా...ఏపీ సీఎం మాత్రం లేఖలు రాయడంలోనే సమయం వృథా చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో మూడోదశ వ్యాక్సిన్ పంపిణీకి 16 వందల కోట్లు అవసరం కాగా...సీఎం మాత్రం 45 కోట్ల మంజూరుతో సరిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా రోగులకు తోచిన విధంగా సాయం చేస్తూ తెలుగుదేశం తన కర్తవ్యం నిర్వర్తిస్తోందన్న చంద్రబాబు...ప్రతి మండలానికి ఒక వైద్యుడిని నియమించి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.
సమావేశంలో 13 అంశాలపై తెలుగుదేశం తీర్మానం చేసింది. రాష్ట్రంలో ఆక్సిజన్ అందక చనిపోయిన ఘటనలన్నీ ప్రభుత్వ హత్యలేనని పేర్కొంది. కరోనా బాధితులకు ఇచ్చిన సాయం, మృతుల సంఖ్యపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ పెట్టినందున...రాష్ట్రంలోనూ ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరింది.
ఇదీచదవండి
అరండల్ పేట, నరసరావుపేటలో.. తెదేపా అధినేత చంద్రబాబుపై కేసులు