Cargo services: గన్నవరం విమానాశ్రయం నుంచి త్వరలో కార్గో కోసం నాలుగు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తామని ఇండిగో ప్రతినిధులు ప్రకటించారు. అక్టోబరులో తొలి విమానాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని ఇతర విమానాశ్రయాలను కలుపుతూ ఈ కార్గో సర్వీసు నడుస్తుందన్నారు. గన్నవరం సహా విశాఖ, రాజమండ్రి విమానాశ్రయాల్లో ఎయిర్‌కార్గోకు ఉన్న అవకాశాలను ఏపీ ఛాంబర్స్ ఆధ్వర్యంలో గురువారం ఇండిగో ప్రతినిధులకు వివరించారు. ఇండిగో రీజినల్ డైరెక్టర్ గిరిధరన్, రీజినల్ మేనేజర్ మహేష్ గణేశణ్‌తో ఏపీ ఛాంబర్స్ అధ్యక్షులు (ఎలక్ట్) పొట్లూరి భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, ఆఫీస్ బేరర్లు సమావేశమయ్యారు.
పొట్లూరి భాస్కరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆక్వా, ఆగ్రో ఉత్పత్తుల ఎగుమతికి మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. ఎగుమతిదారుల్లో నమ్మకం కలిగించడానికి ఎయిర్‌కార్గో షెడ్యూల్‌ను ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఇండిగో ప్రతినిధులు స్పందిస్తూ.. త్వరలో గన్నవరం నుంచి ఈ సేవలు ప్రారంభిస్తామన్నారు. రాజమండ్రి విమానాశ్రయం నుంచి కూడా వీటిని పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే విశాఖపట్నం నోటిఫై అయిందని, కస్టమ్స్ క్లియరెన్స్ వస్తే అక్కడి నుంచి కూడా ప్రపంచంలోని 27 నగరాలకు కార్గో సేవలను ఆరంభిస్తామని చెప్పారు.
ఇవీ చదవండి: