రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు అందరూ కలిసికట్టుగా ఓ మహా సంగ్రామానికి సిద్ధం కావాలని రాజ్యసభ సభ్యులు, బీఎస్పీ జాతీయ సమన్వయకర్త రాంజీగౌతమ్ పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు సంక్షేమ పథకాల పేరిట ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని అన్నారు. 80 శాతానికిపైగా ప్రజలున్న ఈ వర్గాలకు చెందిన వారెవరూ గడిచిన 70 ఏళ్లలో అధికారంలో లేకపోవడానికి కారణం ఏమిటనేది అంతా ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. తక్కువ శాతం రిజర్వేషను ఉన్న వారంతా ఏళ్లతరబడి పాలన సాగిస్తున్నారన్నారని.. ఈ పరిస్థితులు మారాలని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన కార్యకర్తల సమ్మేళనం కార్యక్రమంలో రాంజీ గౌతమ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తూ హక్కులను సైతం కాలరాస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పేరిట పదిలక్షల రూపాయలు ఇచ్చేలా ఓ పథకం రూపొందించిందని అన్నారు. కానీ.. తమకు కావాల్సింది ఆర్థిక సాయం కాదని... బహుజనులకు రాష్ట్ర ఖజానా తాళం చెవి అని పేర్కొన్నారు. 2022 నుంచి 2025 వరకు బహుజనుల రాజ్యాధికారం సాధనే లక్ష్యంగా అందరం పనిచేయాల్సిన తరుణమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రదర్శనకు అనుమతి లేదంటూ తమ వాహనాలు నిలువరించినా- మున్ముందు రాష్ట్రంలో అధికారంలోకి రాబయే ఏనుగును ఆపలేరని రాంజీగౌతమ్ వ్యాఖ్యానించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. రాజ్యాంగ బద్ధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తే కులాల మధ్య అంతరాలు ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయని ప్రశ్నించారు.
ఇదీ చదవండి:
ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం.. భయాందోళనలో ఉపాధ్యాయులు, విద్యార్థులు