Diseases: రాష్ట్రంలో ప్రజల జీవనశైలి మారుతోంది. ఆహార అలవాట్లూ మారుతున్నాయి. పైగా వ్యాయామం చేయడంలేదు. పెరుగుతున్న వయసుకు తగ్గట్లు సకాలంలో పరీక్షలనూ చేయించుకోవడం లేదు. ఈ విపరీత ధోరణి అసాంక్రమిక జబ్బుల విజృంభణకు దారితీస్తుందని వైద్యనిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. వారి అనుమానాలను నిజం చేస్తూ రాష్ట్ర ప్రజలపై రక్తపోటు, మధుమేహం పంజా విసురుతున్నట్లు వైద్యారోగ్య శాఖ అధ్యయనం తేల్చింది. పరీక్షించిన ప్రతి వంద మందిలో ఈ రెండింటిలో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్న వారు సగం మందికిపైగా ఉన్నట్లు గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. ఇవీ వివరాలు..
కరోనా తొలివిడత తర్వాత రాష్ట్రాల వారీగా ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా 30 ఏళ్లు పైబడిన పురుషులు/మహిళల్లో రక్తపోటు, మధుమేహం గుర్తించేందుకు గ్లూకోమీటర్, బీపీ పరికరాలను సమకూర్చింది. ఎత్తు, బరువు, ఇతర వివరాలనూ తీసుకోవాలంది. ఈ మేరకు మన రాష్ట్రంలో 2020 సెప్టెంబరు 1 నుంచి 2021 మార్చి 31 వరకు సర్వే నిర్వహించారు. వారిలో 30 ఏళ్లు పైబడిన వారు 2,30,69,307 మంది ఉన్నారు. సర్వే అనంతరం 19,11,645 (8.19%) మంది రక్తపోటుతో, 14,28,226 (6.27%) మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అయితే... నిర్ధారణ పరీక్షలతో వీరిని మరోసారి గుర్తించాలని కేంద్రం నిర్దేశించడంతో తాజాగా సర్వే చేస్తున్నారు.
1.62 కోట్ల మంది నుంచి వివరాల సేకరణ.. రాష్ట్రంలో గత ఏడాది అక్టోబరు రెండు నుంచి రెండోసారి సర్వే ప్రారంభమైంది. ఇప్పటివరకు 13 జిల్లాల్లో కలిపి 1,62,33,599 మంది నుంచి వివరాలను సేకరించారు. పరీక్షలు చేస్తున్న కొద్దీ... రక్తపోటు, మధుమేహం వంటి అసాంక్రమిక జబ్బులున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ముప్ఫై ఏళ్లు దాటిన వారిలో 50,10,708 మందిని పరీక్షిస్తే 26.71% మందిలో రక్తపోటు, 26% మందిలో మధుమేహం ఉన్నట్లు తేలడం ఆందోళన కలిగిస్తోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి వారు కృష్ణా జిల్లాలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. గుంటూరు, తూర్పుగోదావరిపైనా వీటి ప్రభావం ఎక్కువగానే ఉంది.
క్యాన్సర్ అనుమానితులకు మళ్లీ పరీక్షలు.. సర్వేలో 19,395 మందిలో వివిధ క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు తెలిసింది. వారిలో నోటి క్యాన్సర్ 4,488, రొమ్ము 3,451, సర్వైకల్ క్యాన్సర్‌కు సంబంధించి 11,456 మంది ఉన్నారు. వీరందరికీ తదుపరి పరీక్షలు నిర్వహిస్తేనే నిర్ధారణ జరుగుతుందని వైద్యులు తెలిపారు. స్థానిక వైద్యాధికారి, గైనకాలజిస్టుల పర్యవేక్షణలో వీరికి పరీక్షలు చేయిస్తామన్నారు.
జీవనశైలిలో అనూహ్య మార్పులే కారణం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ఆహార అలవాట్లు, జీవనశైలి భిన్నంగా సాగుతున్నాయి. ఈ కారణంగా కొవిడ్ తర్వాత మధుమేహం కేసులు అధికంగా బయటపడుతున్నాయి. ఉప్పు అధిక వాడకంతో మధుమేహం, రక్తపోటు కేసులు పెరుగుతాయి. విద్యార్థి దశలో మార్కుల కోసం పెరిగే మానసిక ఒత్తిడి క్రమంగా రక్తపోటు, మధుమేహానికి దారితీస్తోంది. ఊబకాయమూ సమస్యాత్మంగా మారుతోంది. చిన్నపిల్లలు సైతం మధుమేహం బారినపడుతున్నారు. అన్ని వయసుల వారు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. హానికారక కొవ్వులతో కూడిన ఆహారాన్ని ప్రతిఒక్కరూ తగ్గించాలి.
-డాక్టర్ వెంకటకృష్ణ, హెచ్‌ఓడీ, జనరల్ మెడిసిన్, విజయవాడ జీజీహెచ్
ఇదీ చదవండి: