వినాయకచవితి వేడుకలు బహిరంగ వేదికలపై నిర్వహించడానికి వీల్లేదంటూ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం వెనుక ‘కుట్రకోణం’ దాగి ఉందని అనుమానిస్తున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. ‘కరోనా సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మీ పార్టీ భావించలేదా..? కరోనా అదుపులో ఉందని రాష్ట్ర ప్రభుత్వమే చెబుతోంది. అలాంటప్పుడు.. చవితి వేడుకలకు వైరస్ ఎందుకు అడ్డంకిగా కనిపిస్తోంది’ అని శనివారం సీఎం జగన్‌కు రాసిన లేఖలో ప్రశ్నించారు.
హిందూ వ్యతిరేక విధానాల కొనసాగింపులో భాగంగానే వేడుకలను రద్దు చేసినట్లు హిందూ సమాజం భావిస్తోందని, కరోనా నిబంధనలకు అనుగుణంగా వేడుకలను నిర్వహిస్తే అభ్యంతరమేమిటని ప్రశ్నించారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా వేడుకలకు అనుమతించాలని డిమాండు చేశారు. ‘హిందూ ధర్మం, దేవాలయాలు, సంస్కృతిపై కొనసాగుతున్న దాడులు, వాటిపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి హిందూ మతంపై వివక్షను బహిర్గతం చేస్తోంది.
వందేళ్లుగా చవితి వేడుకలను నిర్వహించుకోవడం మీకు తెలియని విషయం కాదు. కరోనా పేరుతో కార్యక్రమాలు ఇంటివద్దే చేసుకోవాలంటూ.. బహిరంగ ప్రదేశాల్లో జరగకుండా చర్యలు తీసుకోవాలని మీరు (సీఎం) సమీక్షా సమావేశంలో నిర్ణయించడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా వేడుకలు చేసుకోవాలని, జాగ్రత్తలు తీసుకోవాలని ప్రకటిస్తే బాగుండేది.
కరోనా నిబంధనలు పాటిస్తూ అన్ని వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు, సినిమాహాళ్లు పని చేస్తున్న విషయాన్ని మీకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో అధికారులతో పాటు రాజకీయపక్షాలతో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు, సలహాలు తీసుకోవాలి. ఎవరినీ సంప్రదించకుండా వేడుకలు చేసుకోవద్దన్న ఏకపక్ష మొండివైఖరిని ఖండిస్తున్నాం. ఊరేగింపులు, నిమజ్జనం చేయొద్దంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని నిలిపేయాలి’ అని సోము వీర్రాజు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: