రాష్ట్రంలో భాజపా, జనసేన మధ్య పొత్తు ఖరారైన తరువాత... రెండు పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం విజయవాడలో జరిగింది. కమిటీ కన్వీనర్‌గా భాజపా నేత పురంధేశ్వరి, కోకన్వీనర్‌గా జనసేన నేత నాదెండ్ల మనోహర్ వ్యవహరించారు. ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు సమావేశంలో పాల్గొన్నారు. రాజధాని తరలింపు, శాసనమండలి రద్దు, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించారు. వికేంద్రీకరణ బిల్లుపై జగన్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని నేతలు అభిప్రాయపడ్డారు. సెలెక్ట్ కమిటీకి బిల్లు పంపించి ప్రజాభిప్రాయ సేకరణ చేసే అవకాశమున్నా... ప్రభుత్వం మండలి రద్దు చేయటాన్ని తప్పుపట్టారు.
భాజపా, జనసేన సమన్వయ కమిటీ భేటీలో రాజధాని రైతుల పోరాటంపైనా చర్చించారు. కేంద్రం జోక్యం చేసుకుంటే న్యాయం జరుగుతుందని రైతులు భావిస్తున్నారని, ముందుగా వారి వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని ఇరు పార్టీలు భావించాయి. ఉమ్మడిగా రాజధాని ప్రాంతంలో పర్యటించటం ద్వారా... తమతో కేంద్ర ప్రభుత్వం ఉందన్న భరోసా కల్పిస్తామని నేతలు అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం చేసిన తప్పులే వైకాపాకు అనుకూలంగా మారాయని సమావేశంలో తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా, జనసేన జంటగా పోటీ చేయాలని నిర్ణయించాయి. దీని కోసం క్షేత్ర స్థాయిలో కమిటీలు నియమించాలని తీర్మానించారు. ఓ పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న తరుణంలో... కమిటీలూ అదే తరహాలో ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి... ప్రతి ఐదు పార్లమెంటు స్థానాలకు ఓ కమిటీ ఉండేలా కార్యాచరణ రూపొందించనున్నారు. రెండు పార్టీల అధ్యక్షులు... కమిటీలో సభ్యులను త్వరలోనే ఖరారు చేయనున్నారు.
రాజధాని సహా అన్ని ప్రాంతాల్లోనూ ప్రతి 15 రోజులకోసారి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి... స్థానిక సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని భాజపా, జనసేన అభిప్రాయపడ్డాయి.
ఇదీ చదవండి: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా- జనసేన కలిసే పోటీ