తెలుగుదేశం రాష్ట్ర కార్యవర్గం ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు పూర్తి చేశారు. రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై... ఆయన ఇది వరకే పొలిట్ బ్యూరో సభ్యులు, పార్టీ సీనియర్ నేతల అభిప్రాయం తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో.... పార్టీని నడిపించాలంటే అచ్చెన్నాయుడు లాంటి దూకుడు నేత అయితేనే సబబు అనే.. అభిప్రాయం అధిక శాతం మంది వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో సీనియర్లు, యువనేతలు, క్యాడర్ అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే.. ఈ నియామకానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఒకానొక దశలో ఎంపీ రామ్మోహన్ నాయుడు పేరును కూడా.... పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పరిశీలించారు. చిన్న వయసు కావడం సీనియర్ నాయకులతో సమన్వయం చేసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతాయనే భావన వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు సేవలను వేరే విధంగా ఉపయోగించుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. పార్టీ నేతలతో చాలా సమన్వయంగా కళా పని చేశారని పలు సందర్భాల్లో కితాబిచ్చారు.
తెలుగుదేశంలో 2019 ఎన్నికలకు ముందు ఏర్పాటైన రాష్ట్ర, జిల్లా కార్యవర్గాలే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మే నెలలో జరిగే మహానాడు నాటికి జిల్లా, రాష్ట్ర కార్యవర్గ నియామకం పూర్తి చేయాల్సి ఉన్నా... కరోనా వల్ల ఆలస్యమైంది. క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు, గత ఎన్నికల్లో పార్టీ ఓటమి అనంతర పరిణమాల్ని, సామాజిక సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకుని... రాష్ట్ర కమిటీ, లోక్‌సభ నియోజవర్గాలవారీగా పార్టీ అధ్యక్షుల ఎంపికపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు తెదేపా వర్గాల సమాచారం. భవిష్యత్లో జిల్లాల సంఖ్య పెరిగినా.. అందుకనుగుణంగా కమిటీలు పనిచేసేలా 25పార్లమెంట్ స్థానాలకు 25 మంది కొత్త అధ్యక్షుల్ని నియమించనున్నారు.
ఈనెల 26న చంద్రబాబు అమరావతికి వస్తారని, ఆ తర్వాతి రోజు ఆయనే కమిటీలను ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ