నాటుసారా తాగి 27 మంది చనిపోయారని వారి కుటుంబసభ్యులే చెబుతుంటే.. ముఖ్యమంత్రి జగన్ మాత్రం శాసనసభలో అవన్నీ సహజ మరణాలని చెప్పటం దారుణమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. నాటుసారా అంశంపై శాసనసభలో చర్చించాలని డిమాండ్ చేస్తే.. తమ పార్టీ సభ్యులను సస్పెండ్ చేశారన్నారు. శాసనసభలో వైకాపా సభ్యులు నోటితో ముఖ్యమంత్రి భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
"సహజ మరణాలంటూ ఇవాళ కూడా సభలో సీఎం మాట్లాడారు. మద్యం పాలసీని ఎందుకు మార్చారని జగన్‌ను ప్రశ్నిస్తున్నాం. ప్రస్తుత బ్రాండ్లు అన్నీ చంద్రబాబు తెచ్చారని అబద్ధాలు చెబుతున్నారు. మా హయాంలో మద్యం బ్రాండ్ల గురించి ఎవరైనా ప్రశ్నించారా ? మద్యం పాలసీ మార్చి.. దుకాణాలు తీసుకోవడం వల్లే సమస్య వచ్చింది." -అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు
నాటుసారా మరణాలపై ఎక్సైజ్ కమిషనర్‌కు వినతిపత్రం ఇవ్వకూడదా ? అని అచ్చెన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన తెదేపా ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేయటం దుర్మార్గమన్నారు. కమిషనర్‌ను కలిసేందుకు కూడా ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వరా ? అని నిలదీశారు. నాటుసారా మరణాలపై జ్యుడీషియల్ విచారణ వేసేందుకు భయమెందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
"నచ్చిన బ్రాండ్ కొనుక్కునే స్వేచ్ఛ వినియోగదారుడికి గతంలో ఉండేది. ఇవాళ రేటు చెప్పి మద్యం అడగాల్సిన దుస్థితి తెచ్చారు. ప్రతి మద్యం దుకాణంలో 10 సీసాలు తీసుకుని తనిఖీలు చేయిద్దాం. మద్యంలో ఎంత హానికరమైన రసాయనాలు ఉన్నాయో తెలుస్తుంది. మద్యం బ్రాండ్లపై మేం మాట్లాడకుండా చేశారంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. మద్యం కొనుక్కోలేకే నాటుసారా తాగారని అందరికీ తెలుసు." -అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు
అరెస్టులు చేసినా, జైలులో పెట్టినా నాటుసారాపై తమ ఆందోళన ఆగదని అచ్చెన్న స్పష్టం చేశారు. జె.బ్రాండ్ మద్యం పూర్తిగా ఆగేవరకు పోరాటం చేస్తామన్నారు. మేం ఇచ్చిన మద్యం బ్రాండ్లే కొనాలనే విధానాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చారని దుయ్యబట్టారు. ప్రజలు మద్యం తాగకుండా అడ్డుకుంటున్నామని అనటం దుర్మార్గమన్నారు. మద్యం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలని సీఎం యోచిస్తున్నారని అచ్చెన్న విమర్శించారు.
"మద్యం బ్రాండ్లు, తయారీ కంపెనీలపై మరిన్ని వివరాలు చెబుతాం. దశలవారీగా మద్యపాన నిషేధమని ఎన్నికల ముందు మీరు చెప్పలేదా ?. వైకాపా ప్రభుత్వం వచ్చాక మద్యంపైనే ఎక్కువ ఆదాయం వస్తోంది. మద్యం వినియోగం తగ్గితే దానిద్వారా వచ్చే ఆదాయం ఎలా పెరుగుతోంది ?. మద్యం ఆదాయం రూ.6 వేల కోట్ల నుంచి రూ.16,500 కోట్లకు పెరిగింది." -అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చదవండి
ప్రసాదంపాడు ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద.. తెదేపా ఎమ్మెల్యేల అరెస్టు!