దేశాన్ని బలహీన పరిచేలా భాజపా ప్రభుత్వ చట్టాలు చేస్తోందని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. దేశంలో తొలిసారిగా మతం పేరు మీద చట్టం చేసిన ప్రభుత్వం ఇదేనని పేర్కొన్నారు. ముస్లింలకు అన్యాయం చేయటం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా కేంద్రం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
తెదేపా అధినేత చంద్రబాబు సీఏఏ విషయంలో మోదీకి భయపడవద్దని ఓవైసీ కోరారు. చంద్రబాబు ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి నిర్భయంగా మోదీని ఎదిరించవచ్చని పేర్కొన్నారు. ఇది కేవలం ముస్లింలకు సంబంధించిన విషయం కాదని... భారతీయులు అందరికి సంబంధించిన విషయమని పేర్కొన్నారు. ఇది ఏ ఒక్క మతానికో సంబంధించిన విషయం కాదని స్పష్టం చేశారు.
ఈ చట్టాలకు వ్యతిరేకంగా వారానికోసారి బహిరంగ సభలు పెట్టాలని ఓవైసీ కోరారు. అవసరమైతే జైల్ భరో నిర్వహించాలని నినదించారు. 2015 ఆరోగ్య సర్వే ప్రకారం చాలా మందికి జనన ధ్రువీకరణ పత్రాలు లేవన్నారు. 40 శాతం ముస్లింలు, 40 శాతం వెనుకబడిన వర్గాల వారికి జనన ధ్రువీకరణ పత్రాలు లేవని ఓవైసీ వివరించారు.
జామియా మిలియా లైబ్రరీలో విద్యార్థులు చదువుకుంటుంటే పోలీసులు వారిపై దాడి చేశారని చెప్పారు. పోలీసుల దాడుల్లో ఓ విద్యార్థికి కన్ను పోయిందని వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన 124 జీవో తప్పు అని అసదుద్దీన్ చెప్పారు.
ఇదీ చదవండీ... 'సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా వైకాపా బిల్లు పెట్టాలి'