రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని భద్రతా చర్యలు తీసుకున్నట్లు డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. నాలుగు దశల ఎన్నికల్లోనూ పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారని.. ప్రత్యేక బలగాలను రప్పించడం లేదని చెప్పారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో నిఘా పెంచినట్లు స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు మావోయిస్టులు ప్రకటించగా.. వారి ప్రభావమున్న చోట్ల సరిహద్దు రాష్ట్రాలతో కలిసి ముందస్తు వ్యూహాలను అమలు చేస్తున్నామన్నారు.
తాయిలాలకు అడ్డుకట్ట...
సరిహద్దుల నుంచి మద్యం, నగదు రవాణాను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని సవాంగ్ తెలిపారు. ఓటర్లకు తాయిలాల పంపిణీ జరగకుండా ముమ్మరంగా తనిఖీలు చేస్తూ.. ఆయా వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా పోలీసులు తక్షణం స్పందిస్తున్నారన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నామని.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు పార్టీలు, ప్రజలు సహకరించాలని కోరారు.
తర్వాతే సెలవులు...
ఇతర రాష్ట్రాల్లో పోలీసులు కరోనా టీకాలు తీసుకోగా.. ఏపీలో స్థానిక ఎన్నికల అనంతరం వాక్సినేషన్ ప్రారంభం అవుతుందని డీజీపీ పేర్కొన్నారు. కరోనా వల్ల అస్వస్థతకు గురైన వారిని అప్రాధాన్య సేవలకు వినియోగిస్తామన్నారు. కొవిడ్ కారణంగా పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవులు సక్రమంగా మంజూరు చేయలేకపోయామని.. ఎన్నికల తర్వాత ఇస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:
ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్‌గా గౌతమ్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ