రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ జలకళ పథకం కింద రెండు లక్షల మంది రైతులకు ఉచితంగా బోరు బావులు తవ్వించడమే కాకుండా.. ఉచితంగా బోర్లు అందించిందని జలవనరులశాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్‌కుమార్ తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భూగర్భజలశాఖ స్వర్ణోత్సవాల సందర్భంగా.... 'భూగర్భ జల వ్యవస్థలు- సవాళ్లు- అవకాశాలు' అనే అంశంపై నిర్వహించిన సదస్సులో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భూగర్భ జల గణనశాఖ తన 50 ఏళ్ల కాలంలో ఎంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించిందని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం భూగర్భ జలాల పరిరక్షణకు పూర్తిగా సహకరిస్తుందని.. ప్రజలు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.
గత 50 ఏళ్లుగా భూగర్భ జలశాఖ వేసిన అడుగులను పొందుపరుస్తూ ఓ పుస్తకం తీసుకురావడంపై మంత్రి అభినందనలు తెలిపారు. భూగర్భ జలాల లభ్యతలో 80 శాతం తాగునీటి అవసరాలకు.. 50 శాతం నీటిపారుదల అవసరాలను తీర్చగలుగుతున్నామని రాష్ట్ర జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు చెప్పారు. 25 ఏళ్ల కిందట దేశంలోనే తొలి హైడ్రాలజీ ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు సుస్థిర స్థానం ఉందన్నారు.
అవగాహన పెంచాలి:
భావితరాల భవిష్యత్తు దృష్ట్యా... జలాల సంరక్షణకు ఇంకా చర్యలు తీసుకోవాల్సి ఉందని సెంట్రల్ గ్రౌండ్‌వాటర్ బోర్డు ఛైర్మన్ జి.సి.పఠి అన్నారు. నేటి ఆధునిక సమాజంలో నీటి వినియోగం ఎక్కువగా ఉన్నందున... పరిమితికి మించి భూగర్భ జలాలు కలుషితం అయ్యాయని తెలిపారు. నీటి వినియోగం చేసే ప్రతి ఒక్కరికి భూగర్భ జలాల అవశ్యకతను తెలియజేయడంలో జలవనరుల శాఖ మరింత చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. హైడ్రాలజీ విభాగం చీఫ్ ఇంజనీరు టి.వి.ఎన్.రత్నకుమార్, రాష్ట్ర భూగర్భ జలగణన శాఖ సంచాలకులు ఏ.వరప్రసాదరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: