విశాఖ, తిరుపతి, అనంతపురం నగరాల్లో ఐటీ కాన్సెప్ట్ సిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే ఐటీ దిగ్గజ నగరాలైన బెంగళూరు, చెన్నైకు సమీపంలో ఉండటంతో అనంతపురం, తిరుపతిని ఐటీ కాన్సెప్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఐటీ సంస్థల భవిష్యత్ విస్తరణలో భాగంగా దగ్గరలో ఉన్న ఈ నగరాల్లో నూతన కార్యాలయాలు ఏర్పాటు చేసేలా వారిని ఆకర్షించాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే ఐటీ సంస్థలకు కేంద్రంగా ఉన్న విశాఖను మరింత అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఇంతవరకు భాగానే ఉన్నా.. రాష్ట్రంలోనే అత్యధికంగా ఐటీ రంగ ఉద్యోగులున్న విజయవాడ ప్రాంతంలోనూ మరో ఐటీ కాన్సెప్ట్ సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు.
ఐటీలో మేటిగా ఎదిగిన హైదరాబాద్‌కు ఈ నగరం సమీపంలోనే ఉండటం కలిసొచ్చే అంశం. మానవ వనరులు, రవాణా, మౌలిక సౌకర్యాలున్న ప్రాంతంలో సంస్థల ఏర్పాటుకు యాజమాన్యాలూ ఆసక్తి చూపుతాయి. అలా చూస్తే అమరావతిలో ఐటీ అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అత్యధిక ఇంజినీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉండడం, ప్రాంగణ నియామకాల్లో అత్యధిక వేతనాలతో విద్యార్థులు కొలువులు సాధిస్తుండడాన్ని పరిగణలోకి తీసుకోకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు.
గత ప్రభుత్వం ఐటీ పాలసీ ప్రకటించి రాయితీలు ఇవ్వడంతో విజయవాడ, గన్నవరం, మంగళగిరి ప్రాంతాల్లో ఐటీ సంస్థలు ఏర్పాటయ్యాయి. గన్నవరంలోని హెచ్‌సీఎల్ సంస్థలో.. 2వేల 200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మేథ టవర్స్‌లో ప్రస్తుతం పది కంపెనీలు ఉండగా.. వీటిలో రెండు వేల మంది పనిచేస్తున్నారు. విజయవాడలోని ఆటోనగర్ ఐటీ పార్క్ భవనం, బెంజిసర్కిల్, రామవరప్పాడు, ఎనికేపాడు సహా ఇతర ప్రాంతాల్లో కలిపి 30 నుంచి 40 చిన్న ఐటీ కంపెనీలు ప్రస్తుతం నడుస్తున్నాయి.
మంగళగిరిలోనూ ఐటీ టవర్లు ఏర్పాటు చేయడంతో కొన్ని సంస్థలు వచ్చినా....ఎక్కువ శాతం ఇతర నగరాలకు తరలిపోయాయి. మానవ వనరులు పుష్కలంగా ఉండే విజయవాడలోఏటా 2 లక్షల మంది విద్యార్థులు పట్టాలు తీసుకుని బయటకు వస్తున్నారు. ప్రధాన ఐటీ నగరాలు, విదేశాల్లో.. ఈ ప్రాంతానికి చెందిన సుమారు 10 లక్షల మంది ఐటీరంగంలో పనిచేస్తున్నారు. మౌలిక వసతులపరంగానూ అమరావతి ప్రాంతం ఎన్నో అనుకూలతలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం అమరావతిలోనూ ఐటీ కాన్సెప్ట్ నగరం ఏర్పాటు చేయాలని స్థానికులు, నిపుణలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: