తిరుపతిలోని అమరరాజా బ్యాటరీస్ యూనిట్‌ను అక్కడి నుంచి మరోచోటుకు తరలించేలా ఆదేశాలివ్వాలంటూ తాము హైకోర్టును కోరామని అటవీశాఖ కార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శి జీఎస్‌ఆర్‌కేఆర్ విజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఆ సంస్థ పర్యావరణానికి పునరుద్ధరించలేనంతగా నష్టం కలిగించిందని పేర్కొన్నారు. తనిఖీల్లో గుర్తించిన లోపాల్ని సరిచేసుకునేందుకు వారికి రెండు నెలలు అవకాశం ఇచ్చినా.. అవేవీ సరిదిద్దలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ కంపెనీకి క్లోజర్ ఆర్డర్ ఇవ్వగా.. వారు హైకోర్టును ఆశ్రయించారని వివరించారు.
పరిశ్రమలో వినియోగించే నీటిని శుద్ధి చేయకుండా బయటకు వదులుతున్నారని, సీసం కలిసిన ఆ నీటినే మొక్కల పెంపకం, ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్నట్లు తమ తనిఖీల్లో వెల్లడైందని తెలిపారు. ఈ నీరు సమీపంలోని జల వనరుల్లోకి వెళ్లి, అక్కడి పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తోందని చెప్పారు. పర్యావరణానికి హాని కలిగించే పెట్టుబడుల గురించి ఆలోచించటం మానవజాతి మనుగడకే ప్రమాదకరమన్నారు. కంపెనీలు మూసేయాలన్నది ప్రభుత్వ ఆలోచన కాదని.. పర్యావరణానికి హాని కలగకుండా ఉత్పత్తి చేయించాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు.
‘రెడ్ కేటగిరీ పరిశ్రమల్లో గత రెండు, మూడేళ్లుగా తనిఖీలు జరగని వాటిని జిల్లాకు నాలుగైదు చొప్పున ఎంపిక చేసుకుని తనిఖీలు చేయించాం. అందులో భాగంగా చిత్తూరు, తిరుపతిల్లోని అమరరాజా బ్యాటరీస్‌తో పాటు కడపలోని సిమెంటు కర్మాగారాలు, విశాఖపట్నంలోని ఫార్మా కంపెనీల్లో తనిఖీలు చేయించాం. కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటించట్లేదని గుర్తించి వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చాం. లీగల్ హియరింగ్‌కు అవకాశం కల్పించాం. లోపాల్ని సరిదిద్దేందుకు గడువు ఇచ్చాం. తర్వాత మళ్లీ తనిఖీలు చేపట్టాం. అప్పటికీ లోపాల్ని సరిచేయని వాటిని గుర్తించి గత ఏడాది కాలంలో 64 పరిశ్రమలకు ఉత్పత్తి నిలిపివేత (స్టాప్ ప్రొడక్షన్), 50 పరిశ్రమలకు మూసివేత (క్లోజర్) ఆదేశాలు ఇచ్చాం. వాటిలో అమరరాజా బ్యాటరీస్ సంస్థ ఒకటి’ అని వివరించారు.
ఇదీచదవండి..GRMB MEETING: 'గెజిట్ నోటిఫికేషన్‌లో సవరణలు చేశాకే ముందడుగేద్దాం'