AP-BUDGET: 2022-23 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. 2021-22 బడ్జెట్ ప్రతిపాదనల్లో రూ. 55 వేల 182 కోట్ల ఖర్చు చేయలేకపోయినప్పటికీ... ఈసారి రూ. 2 లక్షల 56 వేల 257 కోట్లతో భారీ బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 55 వేల కోట్ల మొత్తాన్ని రుణాల ద్వారా సమకూర్చుకుంటామని బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆర్థికమంత్రి బుగ్గన తెలిపారు. రూ. 48 వేల 724 కోట్ల ద్రవ్యలోటు ఉన్నట్లు వివరించారు. రూ.17 వేల36 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందన్నారు.
2021-22 సవరించిన అంచనాల ప్రకారం రూ. 3 లక్షల 90 వేల 670 కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పు.. 2022-23 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేనాటికి రూ. 4 లక్షల 39వేల 394 కోట్ల పెరుగుతుందని అంచనా వేశారు. ఈ అప్పులు కాకుండా 2021 డిసెంబర్ 31 వరకు వివిధ ప్రభుత్వరంగ సంస్థలు తీసుకున్న లక్షా 17 వేల 503 కోట్ల రూపాయల రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వడ్డీల రూపంలో 21 వేల 805 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలకు గతేడాది కంటే 800 కోట్లు అధికంగా... ఈసారి 48 వేల 802 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. గత బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు 48 వేల కోట్లు ప్రతిపాదించినప్పటికీ... సవరించిన అంచనాల ప్రకారం 39 వేల 615 కోట్లుగా చూపించారు. అలాగే సాధారణ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయమే ఉన్న వేళ.... నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక్కో ఎమ్మెల్యేకి రూ.2 కోట్ల చొప్పున రూ. 350 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థికమంత్రి బుగ్గన వెల్లడించారు. స్థానిక అవసరాల మేరకు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఖర్చు చేయడం కోసమే నియోజకవర్గ అభివృద్ధి నిధి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
నిర్దిష్ట కాలవ్యవధిలో ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అందుకోవాలన్న నీతిఆయోగ్ సిఫారసులకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన చేశామన్నారు. బడ్జెట్ ప్రతిపాదనలన్నీ తప్పుల తడకగా ఉన్నాయంటూ .. ఆర్థికమంత్రి బుగ్గన ప్రసంగం సాగుతున్నంత సేపూ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం సభ్యులు నినాదాలు చేస్తూనే ఉన్నారు.
ఇదీ చదవండి:
TDP Fires on YSRCP: ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ కొరవడింది: తెదేపా