ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌పై... రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్య, కార్మిక, పురపాలక, పంచాయతీ, స్త్రీ -శిశు సంక్షేమం సహా వివిధ విభాగాల అధికారులతో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో సమావేశం నిర్వహించిన వైద్యఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి... రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించడంపై సమాలోచనలు చేశారు. అలాగే ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రస్తుతానికి సెలవులు ఇచ్చి... వచ్చే నెలలో ప్రకటించి వార్షిక పరీక్షలు నిర్వహించాలని అంశంపై చర్చించారు. అలాగే ఈ నెల 31 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభించడం వైపే మొగ్గు చూపుతున్నారు.
డిగ్రీ కాలేజీలకు సెలవుల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. పరీక్షల పూర్తయ్యే వరకు ప్రభుత్వవసతి గృహాల్లో విద్యార్థులను ఉండనివ్వాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. విశ్వవిద్యాలయాలు పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. వీటన్నింటిపై సీఎంతో చర్చించాక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.
కరోనా వైరస్ ప్రభావం, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కరోనా వైరస్‌పై గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించాలని వైద్యఆరోగ్య శాఖ అధికారులను కోరింది. పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమని భావించింది. పురపాలక , పంచాయతీరాజ్ శాఖలు పారిశుద్ధ్య లోపం లేకుండా చూడాలని సూచించింది. కరోనా అనుమానిత లక్షణాలతో సోమవారం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో ఏడుగురు చేరారు. అలాగే 35 మంది వివిధ ఆసుపత్రుల్లో ఉన్నారు. ఇప్పటివరకు 89 మంది అనుమానితుల నమూనాలు పరీక్షించగా... 75 మందికి నెగిటివ్ వచ్చింది. ఒకటి పాజిటివ్ రాగా, 13 మంది నివేదికలు రావాల్సి ఉంది.
ఈ పరిస్థితుల్లో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్రత్యేక పడకలను అందుబాటులోకి తీసుకురావడంపైనా చర్చలు జరిపారు. మార్కెట్లో మాస్కులు, శానిటైజర్ల డిమాండ్ పెరగటంతో అధిక ధరలకు విక్రయిస్తుండటంపై అధికారులు చర్చించారు. ఎవరైనా కొనుగోలు ధరకు 10 శాతానికి మించి అమ్మితే కఠినచర్యలు చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికే అనంతపురంలో ఓ దుకాణం లైసెన్స్ సస్పెండ్ చేశారు.
ఇదీచదవండి